Penugonda: బైక్‌పై ఇద్దరు కుమార్తెలతో 5,100 కి.మీ యాత్ర!

Penugonda: పెనుగొండకు చెందిన పాపారావు బైక్‌పై తన ఇద్దరు కుమార్తెలతో 21 రోజుల్లో 5,100 కి.మీ ప్రయాణించి 46 పుణ్యక్షేత్రాలను దర్శించుకుని రికార్డు సృష్టించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 16 Oct 2026 8:53 PM IST
Penugonda
X

Penugonda: బైక్‌పై ఇద్దరు కుమార్తెలతో 5,100 కి.మీ యాత్ర!

పెనుగొండ: తన యొక్క 14, 13 వయస్సు కలిగిన కుమార్తెలతో 48 సంవత్సరాల వయస్సున్న పెనుగొండకు చెందిన గొట్టుపల్లి పాపారావు యూనికాన్ బండి మీద 21 రోజులు పాటు 46 క్షేత్రాలను దర్శించిన తీరు అందర్నీ ఆశ్చర్య చకితులను చేస్తున్నది. 5,100 కిలోమీటర్ల మేర సాగిన తన తీర్థయాత్రను ముగించుకొని గురువారం సాయంత్రం పెనుగొండ చేరిన పాపారావు ఆ విషయాలను విలేకరులకు తెలిపారు.

తాను చేసిన తీర్థయాత్రలో ఇది రెండవసారి అని మొదటిసారి భార్యతో కలిసి బండిమీద క్షేత్రాల దర్శనం చేసుకున్నానని ప్రస్తుతం తన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఈశ్వర లాస్య ప్రియ, ప్రియాంక తో ఈ యాత్ర పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.

పెనుగొండ నుండి ద్వారకాతిరుమల గురవాయిగూడెం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, అమరావతి కోటప్పకొండ, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి జోగులాంబ, మంత్రాలయం, హంపి, గోకర్ణం, మురుడేశ్వరం,కొల్లూరు మూకాంబికా ఆలయం, శృంగేరి శారదాపీఠం, ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, ధర్మస్థలి, హోర్నాడు అన్నపూర్ణ టెంపుల్, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్,శ్రీరంగపట్నం, మైసూర్ చాముండేశ్వరి టెంపుల్, కోయంబత్తూర్,ఈషా ఫౌండేషన్ టెంపుల్స్, పళని, గురువాయూర్, త్రివేండ్రం అనంత పద్మనాభ స్వామి టెంపుల్,కన్యాకుమారి, తిరుచానూర్,మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీరంగం, జంబుకేశ్వరం, సమయపురం మారెమ్మ టెంపుల్,తంజావూరు బృహదీశ్వరాలయం, చిదంబరం నటరాజస్వామి టెంపుల్, కంచి కామాక్షి టెంపుల్,అరుణాచలం గిరి ప్రదర్శన,శ్రీపురం గోల్డెన్ టెంపుల్, కాణిపాకం,అర్ధగిరి, తిరుపతి మెట్ల నడక దర్శనం, శ్రీకాళహస్తి, మంగళగిరి పానకాల స్వామి దర్శనాలతో తమ పర్యటన పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.

తన పెద్దమ్మాయి ఈశ్వర లాస్య ప్రియ తిరుపతి మెట్ల మార్గాన్ని మోకాళ్ళతో ఎక్కి దర్శనం చేసుకుందని అన్నారు. తమ తీర్థయాత్ర మొత్తం దగ్గర దగ్గర రోజుకు రెండు మూడు దేవాలయాలు దూరం అయితే ఒక దేవాలయం చొప్పున దర్శనం చేసుకున్నామని అన్నారు.

ఈ యాత్రలో ఆయా దేవాలయాల సత్రంలో భోజనం చేసి మఠం లో నిద్ర చేసామని ఏ రోజు కూడా ఎలాంటి అనారోగ్యం ఎవరికి కలగలేదని పాపారావు వివరించారు.

ఇద్దరు ఆడపిల్లలతో బండిమీద 5వేల వంద కిలోమీటర్లు 21 రోజులపాటు ప్రయాణం చేసి 46 కు పైగా క్షేత్రం దర్శనాలు చేసిన పాపారావుని పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు భక్తజనులు అభినందించారు. ఇది తన జీవితంలో రెండవ సంపూర్ణ తీర్థయాత్ర అని మూడోసారి కూడా ప్రయత్నం చేస్తానని పాపారావు అన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA