Palakollu: గత ఐదేళ్ల నష్టాన్ని వడ్డీతో సహా భర్తీ చేసుకుంటున్నాం
Palakollu: పాలకొల్లు అభివృద్ధికి అధిక నిధులు తెస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. డ్వాక్రా మహిళల ఆత్మీయ సమావేశంలో పండుగ కానుకగా చీరల పంపిణీ.
Palakollu: గత ఐదేళ్ల నష్టాన్ని వడ్డీతో సహా భర్తీ చేసుకుంటున్నాం
పాలకొల్లు: వైసిపి ఐదేళ్ల పాలన ధ్వంసం , విధ్వంసం తప్ప అభివృద్ధి సున్నా. గత ఐదేళ్ల నష్టాన్ని వడ్డీతో సహా భర్తీ చేసుకునేలా పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి రాత్రింబవళ్లు నిరంతరం శ్రమిస్తూ అధిక నిధులు తీసుకు రాగలుగుతున్నానంటే నా కుటుంబ సభ్యులైన పాలకొల్లు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమేనని రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలన్నదే చంద్రబాబు విజన్ అని, ఆ దిశగా అడుగులు వేస్తూ దేశానికే ఆదర్శంగా, స్ఫూర్తిగా డ్వాక్రా సంఘాలు నిలిచాయి అన్నారు. పూలపల్లి ఎస్ ఎస్ ఎస్ కళ్యాణ మండపంలో శనివారం పాలకొల్లు పట్టణ మరియు పాలకొల్లు మండలం డ్వాక్రా వీ.ఓ.ఏ, వీ.ఓ.బీ.ల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలకు వినాయక చవితి, దసరా పండుగలను పురస్కరించుకుని చీరలను అందజేశారు.
సమావేశంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ సమాజంలో సగం జనాభా మహిళలేనని, మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, గ్రామం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. డ్వాక్రా అంటేనే చంద్రబాబు అని, మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగేలా భారతదేశంలోనే తొలిసారిగా స్వయం సహాయక సంఘాల ఉద్యమాన్ని విస్తృత స్థాయిలో ముందుకు తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనన్నారు. మహిళల పొదుపు శక్తిని సంఘటిత శక్తిగా మార్చి, బ్యాంకు రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబనకు మార్గం సుగమం చేశారని చెప్పారు.
డ్వాక్రా సంఘాల ద్వారా లక్షలాది మహిళలు చిన్న వ్యాపారాలు, పశుపోషణ, కుట్టు కేంద్రాలు, ఆహార ఉత్పత్తులు, హస్తకళలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారారని వివరించారు. ఒకప్పుడు కుటుంబ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడిన మహిళలు నేడు కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
డ్వాక్రా ఉద్యమ విజయాల్లో వీఓఏలు, వీఓబీల పాత్ర అత్యంత కీలకమని మంత్రి కొనియాడారు. గ్రామ స్థాయి సంఘాల సమన్వయం, సభ్యుల పొదుపులు, రుణాల పర్యవేక్షణ, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక పారదర్శకత విషయంలో వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.
డ్వాక్రా సీఏలు, ఆర్పీలకు తొలిసారిగా 3వేలు తో గౌరవ వేతనాల వ్యవస్థను తీసుకువచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, నేడు 10 వేలు అందుకుంటున్నారని తెలిపారు. ఈ అంశంపై ఆ అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి దృష్టికి తీసుకెళ్లానని, అనంతరం చంద్రబాబు నాయుడిని కలిసి వారి పరిస్థితిని వివరించగా సానుకూలంగా స్పందించి అమలు చేసినట్లు చెప్పారు.
“మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు” అనే భారతీయ సంస్కృతి స్ఫూర్తితో మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో డ్వాక్రా మహిళలు ఇళ్ల అరుగులపై, ఆలయాల వరండాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితులను చూసి స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు ఉండాలనే లక్ష్యంతో పాలకొల్లు నియోజకవర్గంలో 67 డ్వాక్రా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోయాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామని, ఇప్పటికే కొంతమేర నిధులు కూడా మంజూరయ్యాయని వెల్లడించారు. డ్వాక్రా మహిళలకు ఏ సమస్య వచ్చినా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా తీర్చేందుకు ఎప్పుడు అండగా ఉంటానని మంత్రి నిమ్మల తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని మంత్రి అన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు వివిధ పరిశ్రమలు, సంస్థల సిఎస్‌ఆర్ నిధులను సమీకరించి స్మశానాల అభివృద్ధి, విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు, ఏడాదికి మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తున్నాయని చెప్పారు.
మహిళల చేతిలో పొదుపు పుస్తకం ఉంటే కుటుంబానికి భరోసా, గ్రామానికి అభివృద్ధి, రాష్ట్రానికి ఆర్థిక బలం లభిస్తుందనే లక్ష్యంతో ప్రారంభమైన డ్వాక్రా ఉద్యమం నేడు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజకీయ నాయకులు అంటే ఎన్నికల సమయంలోనే కనిపిస్తారని ప్రజల్లో ఉండే భావనను ఎప్పుడు ప్రజలతో మమేకమవుతు పూర్తిగా మార్చివేసిన నాయకుడు మంత్రి నిమ్మల రామానాయుడు అని తెలిపారు. గత రెండు ఏళ్ల క్రితం బుడమేరు ముంపు గురైనప్పుడు ఎవరు ఉండని విధంగా రాత్రింబవళ్లు గట్టుపైనే ఉండి ముంపు నివారణ పనులను దగ్గరుండి చేయించారంటూ కొనియాడారు
కూటమి నాయకులు కోడి విజయభాస్కర్, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, బోనం చిన్నబాబు , కర్నేన గౌరు నాయుడు, జక్కంపూడి కుమార్, రియా, పాముల రజనీ కుమార్, పొట్నూరి శ్రీనివాస్, ఇంటి శ్రీరాముడు, పీతల శ్రీనివాస్, కొల్లి కొండ ప్రసాద్, ధనాన్ని సూర్యప్రకాష్, దాసరి రత్నం రాజు, పాలవలస తులసిరావు, మేడిది జాన్ రాజు , కలిదిండి రామచంద్ర రాజు,,దొడ్డ ఏడుకొండలు, మండేల రాంప్రసాద్, సత్యనారాయణ రాజు, నెక్కంటి ఆదినారాయణ, కిలారి రామారావు, వరద శేషు తదితరులు , పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.




