Palakollu: పాలకొల్లులో దివ్యాంగులకు రూ.1.10 కోట్ల విలువైన ఉపకరణాల పంపిణీ!
Palakollu: పాలకొల్లులో SAIL సీఎస్‌ఆర్ నిధులు రూ.1.10 కోట్లతో 365 మంది దివ్యాంగులకు 530 సహాయక ఉపకరణాలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల పంపిణీ చేయనున్నారు.
Palakollu: పాలకొల్లులో దివ్యాంగులకు రూ.1.10 కోట్ల విలువైన ఉపకరణాల పంపిణీ!
పాలకొల్లు: మంగళవారం పాలకొల్లు మార్కెట్ యార్డులో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా పంపిణీ దివ్యాంగులకు అండగా నిలిచి, వారు ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన సహాయక ఉపకరణాలను అందించాలనే లక్ష్యంతో పాలకొల్లులో భారీ స్థాయిలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తన మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ ఏ ఐ ఎల్) సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.1.10 కోట్లను మంజూరు చేయించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం పాలకొల్లు మార్కెట్ యార్డులో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు సహాయక ఉపకరణాలను పంపిణీ చేయనున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 తర్వాత ఈ తరహాలో పెద్ద ఎత్తున దివ్యాంగులకు సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ శిబిరం ద్వారా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన 365 మంది దివ్యాంగులకు సుమారు రూ.1.10 కోట్ల విలువైన 530 సహాయక ఉపకరణాలను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు.
ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన దివ్యాంగులకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా నిలవనుంది. మొత్తం లబ్ధిదారుల్లో 253 మంది పురుషులు, 112 మంది మహిళలు ఉండగా, 250 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. లబ్ధిదారుల్లో అతి చిన్న వయస్కుడు మూడేళ్ల బాలుడు కాగా, అత్యధిక వయస్కుడు 87 ఏళ్ల వృద్ధుడు కావడం ఈ కార్యక్రమం అన్ని వయసుల దివ్యాంగులకు అండగా నిలుస్తోందని తెలియజేస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా 148 బ్యాటరీతో నడిచే మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, 172 డిజిటల్ వినికిడి యంత్రాలు, 75 వీల్‌చైర్లు, 25 చేతితో నడిపే ట్రైసైకిళ్లు, 82 నడక సహాయక పరికరాలు సహా మొత్తం 530 ఉపకరణాలను పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుకు సగటున సుమారు రూ.30,000 విలువైన సహాయం ఉచితంగా అందనుంది. ఈ ఉపకరణాలు దివ్యాంగులు తమ రోజువారీ పనులను సులభంగా చేసుకోవడానికి, ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని లాభాపేక్ష రహిత సంస్థ ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ALIMCO) ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు 2025 జూలై 20న పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో అంచనా శిబిరాన్ని నిర్వహించారు.
ఆ శిబిరంలో గుర్తించిన అర్హులకు ఇప్పుడు సహాయక ఉపకరణాలను అందించనున్నారు. దివ్యాంగులకు అవసరమైన సహాయక ఉపకరణాలను ఉచితంగా అందించడం ద్వారా వారి జీవితాల్లో మరింత స్వావలంబన, ఆత్మవిశ్వాసం నింపాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృషితో ఎస్‌ఏఐఎల్ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ఈ సహాయం అందుబాటులోకి రావడం పాలకొల్లు నియోజకవర్గంలోని దివ్యాంగులకు ప్రయోజనం చేకూర్చనుంది.




