Achanta: బీసీలపై జగన్‌ది కపట ప్రేమే - ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ధ్వజం!
Achanta: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రెస్ మీట్. వైసీపీ పాలనలో బీసీలకు పదవులు ఇచ్చి కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వలేదని విమర్శ.
Achanta: బీసీలపై జగన్‌ది కపట ప్రేమే - ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ధ్వజం!
Achanta: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బీసీలపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారని ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. పెనుగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయాలపై ఘాటుగా స్పందించారు.
వైసీపీ ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అధిక సంఖ్యలో కార్పొరేషన్ పదవులు ఇచ్చామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే ఆ పదవులు పొందిన వారికి కనీసం కూర్చోవడానికి కుర్చీలు, పనిచేయడానికి కార్యాలయాలు కూడా లేకుండా చేశారని పితాని ఎద్దేవా చేశారు. బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేవలం పదవులు ప్రకటించడం కాకుండా వాటికి అవసరమైన కార్యాలయాలు, నిధులు, అధికారాలు కల్పించాల్సిందని అన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు పదవులు ఇచ్చి, వారికి కుర్చీలు కూడా ఇచ్చాం.. పనిచేసే అవకాశం కూడా కల్పించాం అని పితాని స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నతి, రాజ్యాధికారమే లక్ష్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గ్రామస్థాయి నుంచి దేశస్థాయి వరకు అన్ని సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఉన్న రిజర్వేషన్లను తగ్గించి వారి రాజకీయ అవకాశాలను దెబ్బతీసిందని పితాని ఆరోపించారు. మార్కెట్ యార్డులు ఇచ్చారు.. కానీ నిధులు ఇవ్వలేదు. సొసైటీలు ఇచ్చారు.. రైతులకు ఏం చేశారు? అంటూ ఆయన ప్రశ్నించారు.
బీసీ వర్గాల అభివృద్ధికి అవసరమైన పనిముట్లు, వనరులు, ఆర్థిక సహాయం అందించకుండా కేవలం పదవులు, హామీలతో కాలం వెళ్లదీశారని విమర్శించారు. బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ సీట్లలో కోతలు పెట్టి, వారి రాజకీయ హక్కులను హరించిన తర్వాత ఇప్పుడు సభలు, సమావేశాలు పెట్టి బీసీలపై ప్రేమ ఒలకబోసడం రాజకీయ కపటత్వానికి పరాకాష్ట అని పితాని మండిపడ్డారు.
అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం చేసి.. ఎన్నికలు దగ్గరపడగానే బీసీలపై ప్రేమ చూపించడం ఏం న్యాయం? అని ఆయన ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంకుగా కాకుండా సమాజంలో గౌరవప్రదమైన భాగస్వాములుగా చూసేది టీడీపీ ప్రభుత్వమేనని పితాని సత్యనారాయణ పేర్కొన్నారు.




