Palakollu: పాలకొల్లు అభివృద్ధి, సంక్షేమమే నా ప్రధాన అజెండా: మంత్రి నిమ్మల!
Palakollu: పాలకొల్లులో సంధ్య మెరైన్స్ సీఎస్‌ఆర్ నిధులతో 198 మంది విద్యార్థులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు.
Palakollu: పాలకొల్లు అభివృద్ధి, సంక్షేమమే నా ప్రధాన అజెండా: మంత్రి నిమ్మల!
పాలకొల్లు: పూలపల్లి సంధ్య మెరైన్స్ సిఎస్ఆర్ నిధులతో 198 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేత. ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని, తలరాతను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
పాలకొల్లు బ్రాడీపేట అల్లు వెంకట సత్యనారాయణ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంతంలో ఆ పాఠశాల 6,7,8,9 తరగతుల విద్యార్థినీ విద్యార్థులు 198 మందికి పూలపల్లి సంధ్య మెరైన్స్ వారి సిఎస్ఆర్ నిధులతో ఉచిత సైకిళ్లను సంస్థ డైరెక్టర్ కే. అరుణ్ కుమార్ తో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ముందుగా మంత్రి రామానాయుడు, అరుణ్ కుమార్ లకు పాఠశాల తరఫున ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
సైకిళ్లను స్వయంగా అందజేసిన మంత్రి విద్యార్థిని విద్యార్థులతో మమేకమవుతు సైకిల్ తొక్కి అందర్నీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ చదువుకుంటే రిక్షా కార్మికుడు కుమారుడు కలెక్టర్, సాధారణ పని చేసుకునే వారి కుమారుడు కుమార్తెలు సాఫ్ట్వేర్ రంగంలో రాణించవచ్చునన్నారు.
చిన్నపాటి గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తాను కూడా పీహెచ్డీ ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే నాడు అధ్యాపకునిగా, నేడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ స్థాయికి ఎదిగానని మంత్రి రామానాయుడు తెలిపారు. చదువు పట్ల తమ పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. సేవా కార్యక్రమాల గురించి వివరిస్తూ అందులో పొందే ఆనందం, తృప్తి మరి ఎక్కడ ఉండదని ఆ ఉద్దేశంతోనే తన తండ్రి పేరుతో ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటుచేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.
నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ ఉచితంగా సైకిలను అందజేయాలని మొదట అనుకున్నా తనకు సంస్థలు, ఇతర కంపెనీలు అందిస్తున్న సహకారంతో 6 నుంచి పదో తరగతి వరకు అందరికీ దశలవారీగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అన్నారు. అందులో భాగంగానే ఈ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత సైకిళ్లతో పాటు గోరింటాడలో స్మశాన వాటిక అభివృద్ధి పనులకు మన ప్రాంతంలోని పూలపల్లి సంధ్య మెరైన్స్ వారి సిఎస్ఆర్ నిధులు రూ 25 లక్షలు అందజేశారని,
అందుకు ఆ సంస్థ ఎండి కే ప్రసాద్, వారి కుమారులైన డైరెక్టర్లు అరుణ్ కుమార్, ఆనంద్ కుమార్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత టిడిపి ప్రభుత్వంలో పాలకొల్లు నియోజకవర్గంను అభివృద్ధి సంక్షేమంలో మొదటి స్థానంలో నిలపగా వైసిపి ఐదేళ్ల పాలనలో ఇరవై ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వంలో
అగ్రస్థానంలో నిలిపేలా ప్రతిరోజు, ప్రతిక్షణం నిధులు కోసం శ్రమిస్తున్నానని ఫలితంగా అభివృద్ధి పనులకు రెండేళ్లలో రూ 1500 కోట్లు వరకు తీసుకువచ్చానన్నారు. రాష్ట్రంలో కీలకమైన ఇరిగేషన్ శాఖ మంత్రి బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో ఆయన ఆదేశాలకు అనుగుణంగా హనుమంతుని వలె పనిచేయడంతో పాటు l జిల్లా ఇన్చార్జి మంత్రిగా, పార్టీ కార్యక్రమాల్లో క్షణం తిరిగి లేకుండా ఉన్నప్పటికీ పాలకొల్లు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నానని చెప్పారు. పాలకొల్లులో గత గొడ్డలి పార్టీ ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన రూ 200 కోట్ల విజ్జేశ్వరం మంచినీటి పథకం, పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి, విద్యుత్ , టిడ్కో గృహాలు వంటి వాటిని మళ్లీ గాడిలో పెడుతూ ముందుకు తీసుకు వెళ్తున్నాం అన్నారు.
సంధ్య మెరైన్స్ డైరెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ మంత్రి నిమ్మల రామానాయుడు తలపెట్టిన విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత సైకిళ్ళు అందజేయడం మంచి కార్యక్రమం అని అభినందించారు. భవిష్యత్తులోనూ తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ ను మంత్రి రామానాయుడు శాలువా కప్పి గజమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ గుమ్మల్ల వీరాస్వామి, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, కూటమి నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, కర్నెన గౌరు నాయుడు, ఉన్నమట్ల కబడ్డి, తుల రామలింగేశ్వరరావు, మీసాల రాము, పొట్నూరి వెంకట రమేష్, కొల్లు పవన్, గంధం సుబ్బారావు, పోలంకి మహేష్, పొట్నూరి శ్రీనివాస్, మహమ్మద్ జానీ, కొల్లి కొండ ప్రసాద్, బేరం శ్రీరామచంద్రమూర్తి, కొలుకులూరి జయప్రకాష్, పెనుమజ్జి మురళి, పీతల శ్రీనివాస్, రియా, ముప్పిరి సత్యనారాయణ, పాఠశాల హెచ్ఎం కే గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.




