Penumantra: మారుటేరు వ్యవసాయ పాలిటెక్నిక్ రజతోత్సవం!
Penumantra: మారుటేరు వ్యవసాయ పాలిటెక్నిక్ రజతోత్సవ సంబరాలు 25 ఏళ్ల ప్రస్థానంలో 1,024 మంది డిప్లొమా పూర్తి అగ్రిసెట్‌లో విద్యార్థుల సత్తా, ఉన్నత విద్యలో రాణింపు.
Penumantra: మారుటేరు వ్యవసాయ పాలిటెక్నిక్ రజతోత్సవం!
పెనుమంట్ర: గ్రామీణ యువతకు నాణ్యమైన వ్యవసాయ విద్యను అందిస్తూ, వ్యవసాయ రంగానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దుతూ మారుటేరు వ్యవసాయ పాలిటెక్నిక్ 25 ఏళ్లుగా విశిష్ట సేవలు అందిస్తోంది. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న ఈ సంస్థ 2026లో రజతోత్సవ వేడుకలను నిర్వహించుకుంటోంది.
1999లో మారుటేరులో వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రారంభమైంది. తొలినాళ్లలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని శాస్త్రవేత్తలు, ప్రయోగశాలలు, క్షేత్ర సదుపాయాలను వినియోగించుకుని విద్యార్థులకు వ్యవసాయ సాంకేతికతపై ప్రత్యక్ష శిక్షణ అందించారు. పదో తరగతి అనంతరం రెండేళ్ల వ్యవసాయ డిప్లొమా విద్యను అందిస్తూ గ్రామీణ యువతకు వ్యవసాయ రంగంలో నైపుణ్యాలను పెంపొందిస్తోంది.
1,024 మంది విద్యార్థులు డిప్లొమా పూర్తి
2024 నాటికి సంస్థ నుంచి 1,024 మంది విద్యార్థులు వ్యవసాయ డిప్లొమా పూర్తి చేశారు. వీరిలో 523 మంది బాలురు, 501 మంది బాలికలు ఉన్నారు. ప్రస్తుతం మొదటి సంవత్సరంలో 44 మంది, రెండో సంవత్సరంలో 32 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
2021 నుంచి బోధనా మాధ్యమం తెలుగుకు బదులుగా ఆంగ్లంగా మారింది. అదే ఏడాది నుంచి ఈ కోర్సుకు ఇంటర్మీడియట్‌తో సమాన గుర్తింపు లభించడంతో విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి.
అగ్రిసెట్‌లో విద్యార్థుల ప్రతిభ
వ్యవసాయ డిప్లొమా అనంతరం ఉన్నత విద్యలో ప్రవేశానికి అగ్రిసెట్ కీలకంగా నిలుస్తోంది. మారుటేరు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు అగ్రిసెట్‌లో ప్రతిభ కనబరుస్తూ ఉన్నత విద్యలో ప్రవేశాలు సాధిస్తున్నారు. ఇప్పటివరకు సంస్థకు చెందిన 192 మంది బీఎస్సీ (ఆనర్స్) వ్యవసాయం, 22 మంది ఎంఎస్సీ, 7 మంది పీహెచ్‌డీ విద్యను అభ్యసించారు. పలువురు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు పరిశోధన, బోధనా రంగాల్లో స్థిరపడ్డారు.




