Gopalapuram: తహసీల్దార్ కార్యాలయంలో మహాకవి గురజాడ జయంతి వేడుకలు ఘనం!

Gopalapuram: ప్రభుత్వ ఆదేశాల మేరకు గోపాలపురం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గురజాడ వెంకట అప్పారావు జయంతి వేడుకలు. పాల్గొన్న తహసీల్దార్ మహాలక్ష్మి.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Published on: 21 Sept 2026 2:16 PM IST
Gopalapuram
X

Gopalapuram: తహసీల్దార్ కార్యాలయంలో మహాకవి గురజాడ జయంతి వేడుకలు ఘనం!

Gopalapuram: గోపాలపురం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రముఖ తెలుగు రచయిత, మహాకవి, సంఘసంస్కర్త గురజాడ వెంకట అప్పారావు జయంతి వేడుకలను సోమవారం గోపాలపురం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీమతి జి. మహాలక్ష్మి గురజాడ వెంకట అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం తహసీల్దార్ మహాలక్ష్మి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యానికి గురజాడ వెంకట అప్పారావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం గ్రామంలో గురజాడ జన్మించారని తెలిపారు. విజయనగరంలో బీఏ చదువుతున్న సమయంలో వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి పంతులు ఆయనకు సహాధ్యాయిగా ఉండేవారని, ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని పేర్కొన్నారు. గిడుగు రామమూర్తి ప్రభావంతో గురజాడ తన రచనల్లో పాండిత్య భాషకు బదులుగా ప్రజలు మాట్లాడే సరళమైన వాడుక భాషను ఉపయోగించి తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించారని తెలిపారు.

సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాలు, అసమానతలను తన రచనల ద్వారా గురజాడ ప్రశ్నించారని అన్నారు. ఆయన రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పారు. ‘ముత్యాల సరాలు’ ద్వారా ఆధునిక తెలుగు కవిత్వానికి నూతన మార్గాన్ని చూపించారని తెలిపారు. అలాగే ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’ అనే దేశభక్తి గీతం, ‘పుత్తడి బొమ్మా పూర్ణమ్మా’ వంటి గేయాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయని పేర్కొన్నారు.

గురజాడ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.193 ద్వారా 18-09-2026న అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తహసీల్దార్ తెలిపారు. సమాజ సంస్కరణ, తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ జోడాల వెంకట్, ఆర్‌ఐ విన్బాబు, సీనియర్ సహాయకులు నల్లరాజు, గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సహాయకులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM