West Godavari: రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా!

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు సర్పంచ్‌గా ఐక్య ఫ్రంట్ అభ్యర్థి వేండ్ర నాగలక్ష్మి విజయం సాధించారు.

Amulya Kulkarni
Published on: 28 Nov 2026 11:55 AM IST
West Godavari
X

West Godavari: రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా!

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఐక్య ఫ్రంట్ అభ్యర్థి వేండ్ర నాగలక్ష్మి విజయం సాధించడంతో గ్రామంలో విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజాస్వామ్యం గెలిచిందని, ఈ విజయం తన ఒక్కరిదే కాదని, యావత్ గ్రామ ప్రజల విజయమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, అభిమానులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొని ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వేండ్ర నాగలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయనని స్పష్టం చేశారు. ఐక్య ఫ్రంట్ అభ్యర్థిగా ప్రజల తరఫున పోటీ చేసి వారి ఆదరణతో విజయం సాధించానని, గ్రామ ప్రజలు అందించిన ఈ బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని తెలిపారు.

పదవీ బాధ్యతలు చేపట్టిన 60 రోజుల్లో గ్రామంలో సమగ్ర సర్వే నిర్వహించి, ప్రతి వీధిలో ఉన్న సమస్యలను గుర్తిస్తామని వెల్లడించారు. గ్రామసభ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడం, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడం, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడం, పనిచేయని వీధిలైట్లను గుర్తించి మరమ్మతులు చేయించడం వంటి మౌలిక సమస్యలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

గ్రామంలోని ప్రతి వీధిని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గ్రామస్తుల సహకారంతో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తానని భరోసా ఇచ్చారు.

ఎన్నికల్లో తనకు అండగా నిలిచి విజయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని వేండ్ర నాగలక్ష్మి పేర్కొన్నారు. విజయోత్సవ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నూతన సర్పంచ్‌కు అభినందనలు తెలియజేశారు. పొలమూరులో ప్రజల తీర్పు గ్రామాభివృద్ధిపై కొత్త ఆశలు రేకెత్తించింది.

Amulya Kulkarni

Amulya Kulkarni