Gopalapuram: గోపాలపురంలో చేపల చెరువులో భారీగా మృతి చెందిన చేపలు రొయ్యలు

Gopalapuram: గోపాలపురం మండలం పెద్దాపురంలో ఆక్సిజన్ కొరతతో చెరువులో భారీగా మృతి చెందిన చేపలు. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Published on: 30 Sept 2026 12:18 PM IST
Gopalapuram
X

Gopalapuram: గోపాలపురంలో చేపల చెరువులో భారీగా మృతి చెందిన చేపలు రొయ్యలు

Gopalapuram: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురంలోని తాడిపూడి కాలువను ఆనుకుని ఉన్న బొల్లా చెరువులో చేపలు, రొయ్యలు మృతి చెందడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. చిట్టిబోయిన వెంకట్రావు అనే రైతు సుమారు 15 ఏళ్లుగా ఈ చెరువులో చేపల సాగు చేస్తున్నారు. పంచాయతీ ద్వారా సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువును లీజుకు తీసుకుని ప్రతి ఏడాది చేపల పెంపకం చేపడుతున్నారు.

అయితే ఈ ఏడాది చేపల సాగు ప్రారంభించినప్పటి నుంచి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు సార్లు చెరువులో పెద్ద సంఖ్యలో చేపలు, రొయ్యలు మృతి చెందినట్లు తెలిపారు. తాజాగా మరోసారి చేపలు మృతి చెందడంతో చెరువు నీటిపై తేలుతున్న చేపలను చూసి రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చెరువులో నీటి ఉష్ణోగ్రత పెరిగి ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోతున్నాయని రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల చేపలు, రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. నీటిలో ఆక్సిజన్ స్థాయులు, నీటి నాణ్యతపై సంబంధిత మత్స్యశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించి కారణాలను గుర్తించాలని కోరుతున్నారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు చేపల మృతి, సాగు ఖర్చులు, మేత తదితర కారణాలతో సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వెంకట్రావు తెలిపారు. ఇప్పటికే పెట్టుబడి పెట్టిన మొత్తం తిరిగి రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

చేపల మృతికి అసలు కారణాలను అధికారులు పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతు కోరుతున్నారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM