Palakoderu: బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రఘురామ కృష్ణంరాజు!
Palakoderu: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో రూ.48 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి.
Palakoderu: బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రఘురామ కృష్ణంరాజు!
Palakoderu: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, గోకులాల నిర్మాణానికి ప్రాధాన్యత, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టటం జరుగుచున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు.
మంగళవారం పాలకోడేరు మండలం, గొల్లలకోడేరు గ్రామంలో వికసిత్ భారత్ జి రాం జి(VB-G-RAM G)నిధులతో రెండు చోట్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
వీటిలో మొదటిది ఎస్పీ కార్యాలయం నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు 32 లక్షల రూపాయలతో కిలోమీటర్ పొడవున బీటీ రోడ్డు, రెండవది ముదునూరి చిన సుబ్బరాజు ఫీల్డ్ నుంచి ఎగ్జిస్టింగ్సిసిసి రోడ్డు వరకు 460 మీటర్ల పొడవున 16 లక్షల రూపాయల వ్యయంతో రెండు బీటీ రోడ్డు పనులు ప్రారంభానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
సందర్భంగా శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో “పల్లె పండుగ 3.0” కార్యక్రమం ద్వారా వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు చేపట్టటం జరుగుతున్నదని అన్నారు. పల్లె ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన రహదారి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, గోకులాల నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక కార్యకలాపాలకు అవసరమైన వసతుల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (VB-GRAM G (Viksit Bharat–Gramin) కార్యక్రమం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అనుగుణంగా స్థానిక అవసరాలను గుర్తించి పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని అన్నారు.
గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ప్రాధాన్యతా క్రమంలో పనులను చేపట్టాలని సంబంధిత అధికారులకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, ప్రజా సౌకర్యాలు, పశుసంవర్ధక వసతులు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడితే ప్రజల రోజువారీ రాకపోకలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగకరంగా ఉండి దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
చేపట్టిన పనులలో నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలని అన్నారు. జిల్లాలో పల్లె పండుగ 3.0 కింద చేపట్టే పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
గ్రామీణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి అరుణకుమారి, పంచాయతీరాజ్ ఏఈ విజయకుమార్ రాజు, పంచాయతీ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.




