Venkataramannagudem: వేంకటరామన్నగూడెంలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం
Venkataramannagudem: వేంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా కేంద్రంలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, రైతులకు అవగాహన, ఉచిత వైద్య శిబిరం చేపట్టారు.
Venkataramannagudem: వేంకటరామన్నగూడెంలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం
వేంకటరామన్నగూడెం: డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వేంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా కేంద్రం (HRS) ఆధ్వర్యంలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. కె. ధనుంజయరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే శ్రేష్ఠమైన ఆహారం, ఔషధాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురై, వైద్య ఖర్చులు, వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులు, మహిళలకు ఔషధ మొక్కలపై విస్తృత అవగాహన కల్పించాలని శాస్త్రవేత్తలను కోరారు. అలాగే ఔషధ మొక్కల సాగు ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించేలా వారిలో ఆసక్తిని పెంపొందించాలని సూచించారు.
కార్యక్రమంలో యూనివర్సిటీ పరిశోధనా సంచాలకులు డా. ఎస్. సూర్యకుమారి, ఉద్యాన పరిశోధనా కేంద్రం అధిపతి డా. సుశీల, ఆయుర్వేద వైద్యులు డా. జి. కేదారి శర్మ పాల్గొన్నారు. ఆయుర్వేదం ప్రాముఖ్యత, ఆరోగ్యం–పోషణలో ఔషధ మొక్కల వినియోగం తదితర అంశాలను రైతులకు వివరించారు.
ఉచిత వైద్య శిబిరం
జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు.
అనంతరం ఔషధ, సుగంధ మొక్కల సాగు పద్ధతులు, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, విలువ జోడింపు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఔషధ మొక్కలను సాగు చేయడం ద్వారా ఆరోగ్య పరిరక్షణతో పాటు రైతులకు ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకునే అవకాశాలపై వివరించారు.
రైతులకు శాస్త్రీయ సూచనలు
AICRP–ఔషధ మరియు సుగంధ మొక్కలు, తమలపాకు విభాగం నుంచి శాస్త్రవేత్తలు డా. జి. రంగన్న (ఉద్యానశాస్త్రం), డా. ఎస్. ఆదర్శ (కీటకశాస్త్రం), జె. దివ్య (వృక్ష రోగశాస్త్రం) కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సాంకేతిక సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బందితో పాటు సుమారు 40 మంది రైతులు పాల్గొన్నారు. ఆయుర్వేదం, ఔషధ మొక్కల సాగును అనుసంధానం చేస్తూ రైతులకు ఆరోగ్యం, పోషణతో పాటు అదనపు ఆదాయ అవకాశాల కల్పనలో ఔషధ, సుగంధ మొక్కల ప్రాధాన్యతను వివరించారు.




