Parkal: మందారం కాలనీలో ఆటపాటలతో బొడ్డెమ్మ వేడుకలు!
Parkal: పరకాల పట్టణంలోని మందారం కాలనీలో మహిళలు బొడ్డెమ్మ సంబరాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు.
Parkal: మందారం కాలనీలో ఆటపాటలతో బొడ్డెమ్మ వేడుకలు!
పరకాల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ సంబరాలను పరకాల పట్టణంలో మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ పండుగకు ముందు వచ్చే బొడ్డెమ్మ వేడుకల్లో భాగంగా పట్టణంలోని మందారం కాలనీలో మహిళలు ప్రతిరోజూ సాయంత్రం ఒకచోట చేరి బొడ్డెమ్మను ప్రతిష్టించి, చుట్టూ చేరి ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటున్నారు.
చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటూ.. బొడ్డెమ్మకు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి, తెలంగాణ సాంప్రదాయ పాటలు పాడుతూ కోలాహలంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. పేడతో చేసిన బొడ్డెమ్మకు బంతి, చేమంతి, గునుగు పూలతో అందంగా ముస్తాబు చేసి పూజలు చేస్తున్నారు.
తెలంగాణ ఆడపడుచులకు బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు ఎంతో ప్రత్యేకమని, ఈ సంబరాలు తమలో ఐక్యతను, సంతోషాన్ని నింపుతాయని మందారం కాలనీ మహిళలు తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తొమ్మిది రోజుల పాటు ఘనంగా బొడ్డెమ్మ సంబరాలు జరుపుకుని, ఆ తర్వాత బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదారం కాలనీకి చెందిన మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




