Warangal: వరంగల్ పశ్చిమలో గెలిచేది బీజేపీయే: రావు పద్మారెడ్డి

Warangal: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వైఫల్యాలపై హనుమకొండ బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రావు పద్మారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 27 Sept 2026 6:18 PM IST
Warangal
X

Warangal: వరంగల్ పశ్చిమలో గెలిచేది బీజేపీయే: రావు పద్మారెడ్డి

వరంగల్: హనుమకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కాండిడేట్ శ్రీమతి రావు పద్మారెడ్డి , బిజెపి జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, GWMC 59వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డి వైఖరిపై, వారి వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా శ్రీమతి రావు పద్మారెడ్డి మాట్లాడుతూ... 59వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డిపై నాయిని రాజేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడం, ఒక మహిళ అని కూడా చూడకుండా లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని, కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు.

ఎమ్మెల్యే ఎన్ని గంతులు వేసినా, ఎన్ని రాజకీయ నాటకాలు ఆడినా రాబోయే ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ గడ్డపై గెలిచేది భారతీయ జనతా పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం మాని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభివృద్ధి పనులు చేయకుండా కేవలం శంకుస్థాపనలు, కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితమయ్యారని విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం (కేంద్ర) నిధులతో జరిగిన పనులను కూడా తామే చేశామని అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం గతంలో రూ. 7.5 కోట్లు ఉంటే, ఇప్పుడు అది రూ. 15.7 కోట్లకు ఎలా పెరిగింది? ఎవరి కమీషన్ల కోసం ఈ మొత్తాన్ని పెంచారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి.

గత పదేళ్లలో BRS పాలనపై పోరాడింది ఒక్క బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల కృషి వల్లే కాజీపేట వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు, వేయి స్తంభాల గుడి పునరుద్ధరణ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మామునూర్ ఎయిర్‌పోర్ట్ వంటి అనేక అభివృద్ధి పనులు సాధ్యమయ్యాయని గుర్తుచేశారు.

సొంత నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, తమ అల్లుడి పెత్తనంపై మాట్లాడకుండా కేంద్ర మంత్రులపై వ్యక్తిగత విమర్శలు, హెచ్చరికలు చేయడం సిగ్గుచేటన్నారు.

సెక్యూరిటీ లేకుండా రమ్మంటూ ఎమ్మెల్యే సవాళ్లు విసరడం విడ్డూరంగా ఉందని, బీజేపీ కార్యకర్తల సత్తా ఏంటో కాంగ్రెస్‌కు బాగా తెలుసని హెచ్చరించారు. మేము తలుచుకుంటే సెక్యూరిటీ ఉన్నా కూడా ఎమ్మెల్యే బయట అడుగుపెట్టలేరని, ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పలువురు బీజేపీ జిల్లా నాయకులు సండ్ర మధు, నర్మెట్ట శ్రీనివాస్ రావు గౌడ్, సంపత్ రెడ్డి, మలోత్ నాను నాయక్, మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జితేందర్, రోకుల సతీష్, తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST