Warangal: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్ఐఆర్ రోల్ అబ్జర్వర్ హరిచందన తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు.
Warangal: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
వరంగల్: అర్హత కలిగిన ప్రతి ఓటరు తుది జాబితాలో ఉండే విధంగా, ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్.ఐ.ఆర్ రోల్ అబ్జర్వర్ హరిచందన సంబధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం వరంగల్ కు విచ్చేసిన రోల్ అబ్జర్వర్ హరిచందన, స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ తీరుతెన్నులను, అభ్యంతరాల వివరాలను బూత్ లెవల్ ఆఫీసర్లను (BLO) అడిగి తెలుసుకున్నారు.
ఫామ్ 6, 7, 8 కొత్త దరఖాస్తులను సక్రమంగా పరిష్కరించారా లేదా అని ఆరా తీశారు. విచారణలు (Hearings) నిర్వహించిన తీరును, ఇంటింటి సర్వే పర్యవేక్షణ వివరాలను పరిశీలించారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి సేకరించిన వివరాలను, ఫీల్డ్ వెరిఫికేషన్ నివేదికలను సమీక్షించారు.
మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన లేదా రెండు చోట్ల ఓటు ఉన్న (ASDD) వారి పేర్లను జాబితా నుండి తొలగించేటప్పుడు నిబంధనలను కచ్చితంగా పాటించారా లేదా అని ఇఆర్ఓ/ అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గారిని అడిగి తెలుసుకున్నారు. సూపర్-చెకింగ్ (Super-checking) లో భాగంగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ERO) ఆమోదించిన మరియు తిరస్కరించిన దరఖాస్తులను (కొత్త ఓటర్ల చేర్పులు, తొలగింపులు, మార్పులు) రోల్ అబ్జర్వర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఎస్.ఐ.ఆర్ లో భాగంగా మొదటి విడతలో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన మరియు రెండు చోట్ల ఓటు ఉన్న 51,073 మంది పేర్లు ASDD జాబితాలో ఉన్నాయని తెలిపారు.
రెండో విడత నోటీసుల ప్రక్రియలో భాగంగా 962 మందిని అనర్హులుగా గుర్తించినట్లు వివరించారు. ఫామ్ 6, 7, 8 లకు సంబంధించి 5005 పెండింగ్ లో కలవని వాటిని త్వరగా ఎంక్వయిరీ చేయగలరని మరియు నోటీసుల పరిశీలన పూర్తి అయ్యిందని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయి విచారణకు బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) కూడా హాజరయ్యారని, ప్రతి బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటి కప్పుడు పూర్తి సమాచారం మరియు జాబితాను అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని ASDD జాబితాలను ERO, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు జిల్లా వెబ్సైట్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్ అదనపు కలెక్టర్ లోకల్ (స్థానిక సంస్థలు) వైవి గణేష్ వరంగల్ తహసిల్దార్ శ్రీకాంత్ ఖిలా వరంగల్లు తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.




