Warangal: వరంగల్ అభివృద్ధికి రూ.382 కోట్లు మంజూరు
Warangal: వరంగల్ అభివృద్ధికి రూ.382 కోట్లతో 5 ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి. సీఎం రేవంత్ రెడ్డికి కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి హృదయపూర్వక కృతజ్ఞతలు.
Warangal: వరంగల్ అభివృద్ధికి రూ.382 కోట్లు మంజూరు
వరంగల్: హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీకి అనుగుణంగా, నగర అభివృద్ధికి రూ.382 కోట్ల అంచనా వ్యయంతో ఐదు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు కుడా కు మంజూరు చేయడం పట్ల కుడా చైర్పర్సన్ శ్రీమతి గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కుడా, వరంగల్ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ చారిత్రక వైభవాన్ని కాపాడుతూ, ఆధునిక మౌలిక సదుపాయాలతో నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ అనుమతులు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
కుడా ఆధ్వర్యంలో వరంగల్ కోట కందకాల పునరుద్ధరణ, హనుమకొండ సెంట్రల్ ప్లాజా అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్, వేయి స్తంభాల గుడి పరిసరాల్లో అభివృద్ధి పనులు, మ్యూజికల్ గార్డెన్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులు నగరానికి కొత్త రూపురేఖలను తీసుకురానున్నాయని తెలిపారు.
వీటితో పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, వాణిజ్య కార్యకలాపాలు, స్థానిక ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ అభివృద్ధి ప్రాజెక్టుల నిధుల మంజూరికి సహకరించిన ఇన్చార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రాజ్యసభ ఎంపీ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారికి, కుడా వైస్ చైర్పర్సన్కు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ గారికి గుండు సుధారాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయడం వల్ల నగర అభివృద్ధి లక్ష్యాలను మరింత వేగంగా సాధించగలమని పేర్కొన్నారు.
“వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి గారు చూపుతున్న ప్రత్యేక చొరవ నగర ప్రజల్లో కొత్త ఆశలను నింపుతోందని, నగరానికి ఇచ్చిన హామీకి అనుగుణంగా కీలక ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడం పట్ల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని.
ఈ ప్రాజెక్టులు సాకారమై వరంగల్ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూ, ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చెందిన నగరంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి తెలిపారు.




