Warangal: ఎంపీ నిధులపై బీఆర్‌ఎస్‌ది తప్పుడు ప్రచారం: కడియం కావ్య
Warangal: రూ.14.70 కోట్ల ఎంపీ నిధుల్లో రూ.12 కోట్లు కేటాయించామని, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.
Warangal: ఎంపీ నిధులపై బీఆర్‌ఎస్‌ది తప్పుడు ప్రచారం: కడియం కావ్య
Warangal: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని, నూతనంగా బాధ్యతలు చేపట్టిన పార్టీ కమిటీలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా పార్టీకి సైనికుల్లా పనిచేయాలని తెలిపారు. ధర్మసాగర్ మండలంలోని సుష్మిత గార్డెన్‌లో సోమవారం నిర్వహించిన నూతన మండల కాంగ్రెస్ కమిటీ, గ్రామ కాంగ్రెస్ కమిటీల పరిచయ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారితో కలిసి వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..అంతకుముందు ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందని ఎంపీ తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
ఎంపీ నిధులపై బీఆర్‌ఎస్‌ది తప్పుడు ప్రచారం
బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గట్టి సమాధానం ఇచ్చారు. ఎంపీ నిధుల విషయంలో వాస్తవాలను పక్కదారి పట్టిస్తూ తాను కేవలం 20 శాతం నిధులు మాత్రమే వినియోగించానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. తనకు ఇప్పటివరకు వచ్చిన రూ.14.70 కోట్ల ఎంపీ నిధుల్లో దాదాపు రూ.12 కోట్లు ఇప్పటికే వివిధ అభివృద్ధి పనులకు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
“నిధులు మంజూరు చేసిన తర్వాత పనుల అమలు బాధ్యత అధికారులదే”అని పేర్కొన్నారు. ఎంపీ నిధులు ఒకసారి సంబంధిత పనులకు కేటాయించిన తర్వాత టెండర్లు, పనుల ప్రారంభం, నిర్మాణ పురోగతి వంటి అంశాలను కలెక్టర్లు, చీఫ్ ప్లానింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుందని వివరించారు. నిధులు విడుదల చేయడం, పనులు పూర్తిచేయడం రెండింటినీ కలిపి చూపిస్తూ తనపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో అక్రమాస్తులు
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అధికారం అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్నారు. ఎంపీ సీఎం రేవంత్‌రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన భూవ్యవహారాలపై తాను, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించినట్లు తెలిపారు. కొన్ని భూముల పత్రాలు, ఎన్‌ఓసీలు, అనుమతులపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. భూవ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమమని తేలిన ఆస్తులను స్వాధీనం చేసుకుని పేదలు, దళితుల ప్రయోజనాలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్రం నుంచి నిధుల కోసం నిరంతర ప్రయత్నం
వరంగల్ అభివృద్ధికి కేంద్ర మంత్రులను నిరంతరం కలుస్తూ వివిధ అంశాలపై ప్రతిపాదనలు అందిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. అలాగే తాను పార్లమెంటులో వరంగల్ సమస్యలను నిరంతరం ప్రస్తావిస్తూ, కేంద్ర మంత్రులను కలిసి అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు. రైల్వేలు, జాతీయ రహదారులు, విద్య, ఆలయాల అభివృద్ధి, కాకతీయ యూనివర్సిటీ, మామునూరు విమానాశ్రయం, టెక్స్‌టైల్ పార్కు, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తదితర అంశాలపై కేంద్రంతో నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు తావివ్వకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ తన పుట్టినిల్లు అని, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. ఎంపీగా తనకు వచ్చే నిధుల్లో స్టేషన్ ఘన్‌పూర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నానని తెలిపారు.
కడియం శ్రీహరి నాయకత్వంలో రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. “కడియం అంటేనే స్టేషన్ ఘన్‌పూర్‌కు అంకితం అని ఎంపీ అన్నారు.
తన తండ్రి కడియం శ్రీహరి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎక్కడా అవినీతికి తావులేకుండా ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. రానున్న రెండేళ్లలో కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనాగల వెంకట్రామ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రసాద్, సర్పంచులు, నూతన మండల కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




