Warangal: నాణ్యత లోపిస్తే బిల్లుల్లో కోత తప్పదు: GWMC కమిషనర్!

Warangal: గ్రేటర్ వరంగల్ పరిధిలో అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని, లేకుంటే బిల్లుల్లో కోత తప్పదని కమిషనర్ టి. వెంకన్న అధికారులు, కాంట్రాక్టర్లను హెచ్చరించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 30 Oct 2026 12:45 PM IST
Warangal
X

Warangal: నాణ్యత లోపిస్తే బిల్లుల్లో కోత తప్పదు: GWMC కమిషనర్!

వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

బుధవారం ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పూర్తయిన, కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్, పోతరాజుపల్లి, ఉర్సు, తోట మైదానం, గిర్మాజిపేట, చార్‌బౌలి, లక్ష్మీపురం మార్కెట్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల పనులను వరంగల్ చౌరస్తా వద్ద చేపట్టిన పైప్‌లైన్ పనులను తనిఖీ చేశారు.

అదేవిధంగా ఖాజీపేట సర్కిల్ పరిధిలోని బంధం చెరువు, ఖాజీపేట దర్గా సమీపంలో, పిస్తా హౌస్ ప్రాంతాల్లో చేపట్టిన పనులతో పాటు శాయంపేటలో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను, ఉర్సు వద్ద నిర్మిస్తున్న యుపిహెచ్సి భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనుల పూర్తిలో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే సంబంధిత బిల్లుల్లో కోత విధించడం జరుగుతోందని హెచ్చరించారు.

అనంతరం శాయంపేటలో పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్వ్వచ్ ఆటో ప్రతిరోజూ చెత్త సేకరిస్తుందా అని నగరవాసులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు తగిన సూచనలు చేశారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని, పారిశుద్ధ్య పనులపై అధికారులు నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంజయ్ కుమార్, రవికుమార్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST