Warangal: సర్వోత్తమ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి!
Warangal: బీఆర్ఎస్ హయాంలో 18 గనులు మూసివేసి కార్మికుల పొట్ట కొట్టారని మంత్రి పొంగులేటి విమర్శించారు.
Warangal: సర్వోత్తమ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి!
వరంగల్: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక సంస్థ సింగరేణిలో 18 గనులను మూసివేసి, 40 వేల మంది కార్మికుల జీవితాలను రోడ్డున పడేసిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
సింగరేణి విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, పదేళ్ల అధికారంలో ఒక్క గనినైనా కాపాడలేకపోయారని మండిపడ్డారు. అప్పట్లో గనుల వేలంపాటలో పాల్గొనకుండా సింగరేణికి అన్యాయం చేసిన బీఆర్ఎస్కు ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడు గనుల వేలంపాటలో పాల్గొని సింగరేణిని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.
గురువారం వరంగల్లో నిర్వహించిన వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐతో కలిపి 32 స్థానాల్లో కాంగ్రెస్ పక్షం బలంగా ఉందని మంత్రి తెలిపారు. మిగిలిన రెండు నియోజకవర్గాల్లోనూ గతంలో కాంగ్రెస్కు గట్టి పట్టు ఉందని గుర్తుచేశారు.
ఈ రాజకీయ బలాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంగా మలచుకోవాలని, కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసి, పట్టభద్రుల ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు సర్వోత్తమ రెడ్డికి వేయించేలా కృషి చేయాలని సూచించారు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఓటు నమోదు, రెన్యువల్కు అవకాశం ఉన్న నేపథ్యంలో దసరా సహా పండుగలకు స్వగ్రామాలకు వచ్చే పట్టభద్రులను గుర్తించి, అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా చూడాలన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఒక్క వరంగల్ జిల్లాలోనే సుమారు 47 వేల పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, అర్హులైన ఓటర్లందరి ఓటు నమోదు, రెన్యువల్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడం పార్టీ ఎన్నికల సన్నద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని పొంగులేటి అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ పోరాటానికి మరింత బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్న లక్ష్య సాధన దిశగా కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.
మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ పరస్పర అవగాహనతో పనిచేస్తున్నాయని విమర్శించిన మంత్రి, ఆ పార్టీల రాజకీయ వ్యూహాలను కాంగ్రెస్ కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సర్వోత్తమ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.




