Warangal: కొత్త పింఛన్ల పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కొండా సురేఖ
Warangal: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 2,740 చేయూత పెన్షన్ల పత్రాలను ఎమ్మెల్యే కొండా సురేఖ లబ్ధిదారులకు అందజేశారు.
Warangal: కొత్త పింఛన్ల పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కొండా సురేఖ
వరంగల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే శ్రీమతి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం పేదలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వివిధ వృత్తులపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
మంగళ వారం వరంగల్ లోని ఎల్ బి నగర్ లోని ఏ1 కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ ధ్రువ పత్రాల అందజేత కార్యక్రమానికి శ్రీమతి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై కుడా చైర్ పర్సన్ శ్రీమతి గుండు సుధారాణి,జిల్లా గ్రంధాలయ చైర్మన్ మీసాల ప్రకాష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ వెంకన్న లతో కలిసి పెన్షన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీమతి కొండా సురేఖ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు కొండంత అండగా నిలుస్తున్నాయని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు ఈ ఆర్థిక సహాయం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొత్త పెన్షన్ల కోసం మొత్తం 3,675 దరఖాస్తులు అందగా, వివిధ కేటగిరీలకు చెందిన 2,740 మందికి ప్రభుత్వం కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేసిందని వెల్లడించారు. వీటి ద్వారా నెలకు రూ.69,89,840 మేర లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందనుందని తెలిపారు.
కొత్తగా మంజూరైన పెన్షన్లలో 733 దివ్యాంగులు, 1,704 వితంతువులు, 166 వివాహిత ఒంటరి మహిళలు, 22 అవివాహిత ఒంటరి మహిళలు, 98 నేత కార్మికులు, 17 తాటి గీత కార్మికులు ఉన్నారని వివరించారు.
అదేవిధంగా నియోజకవర్గంలో ఇప్పటికే 35,716 మంది వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులు చేయూత పెన్షన్లు పొందుతున్నారని తెలిపారు. వీరిలో 10,336 మంది వృద్ధాప్య పెన్షనర్లు, 14,549 మంది వితంతువులు, 4,613 మంది బీడీ కార్మికులు, 3,724 మంది దివ్యాంగులు, 1,433 మంది నేత కార్మికులు, 928 మంది ఒంటరి మహిళలు, 132 మంది తాటి గీత కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో దశలవారీగా అమలు చేస్తూ సంక్షేమ పాలనను ముందుకు తీసుకెళ్తోందని కొండా సురేఖ తెలిపారు. ఇందులో భాగంగా కొత్తగా మంజూరైన పెన్షన్ల మొత్తాన్ని ఈ నెల 19వ తేదీన నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. అదే రోజు నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
పెన్షన్లు మంజూరు కాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరోసారి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన వారందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు లేదా వివరాల్లో పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకోవాలని సూచించారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని అర్హులైన నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో అత్యంత అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి పేద కుటుంబానికి పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా వ్యాప్తంగా పేదలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వివిధ వృత్తులపై ఆధారపడిన వారికి ప్రభుత్వం కొత్తగా 11,750 చేయూత పెన్షన్లు మంజూరు చేసిందని తెలిపారు. ఇందుకోసం నెలకు రూ.2.94 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించనుందని పేర్కొన్నారు. మంజూరైన పెన్షన్ మొత్తాన్ని ఈ నెల 19వ తేదీన నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా 2,740 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయని, వీటి ద్వారా నెలకు రూ.69,89,840 ఆర్థిక సహాయం లబ్ధిదారులకు అందనుందని తెలిపారు.
చేయూత పెన్షన్లు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, వారు గౌరవప్రదంగా జీవిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
కుడా చైర్పర్సన్ శ్రీమతి గుండు సుధారాణి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలతో పాటు పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహిస్తోందని తెలిపారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి, సమాజానికి అండగా నిలవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీ నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళల ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన, నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని గుండు సుధారాణి పేర్కొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీమతి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. పేదల సంక్షేమం, వారి ఆర్థిక భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.ఈ నెల 19వ తేదీ నుంచి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనుండటం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక రక్షణ లభించడంతో పాటు, వారి భవిష్యత్తుకు భరోసా కలుగుతుందని తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కృషి చిరస్మరణీయమని మీసాల ప్రకాష్ అన్నారు.
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో చేయూత పెన్షన్లను మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొత్తగా 2,740 మందికి పెన్షన్లు మంజూరు కావడం ద్వారా మరింత మంది నిరుపేదలకు ఆర్థిక భరోసా లభించనుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వై.వి. గణేష్, అదనపు కమిషనర్ ఇన్చార్జి సమ్మయ్య, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి, ఎంహెచ్ డాక్టర్ రాజేష్, మాజీ కార్పొరేటర్ ఫుర్ఖాన్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




