Warangal: బాలల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి: కలెక్టర్!
Warangal: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని శుక్రవారం వరంగల్ కలెక్టర్ సత్య శారద బాలుర పరిశీలన గృహంలో పిలుపునిచ్చారు.
Warangal: బాలల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి: కలెక్టర్!
వరంగల్: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి చేసిన బాలల హక్కుల తీర్మానానికి గుర్తుగా ప్రపంచ బాలల దినోత్సవం ప్రతి ఏటా నవంబర్ 20 న నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించిన బాలల వారోత్సవాల ముగింపు వేడుకలు శుక్రవారం ఆటోనగర్‌లోని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ శ్రీదేవి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద మాట్లాడుతూ, పెద్దల మాదిరిగానే బాలలకు కూడా ప్రత్యేక హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు.
జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ పొందే హక్కులు బాలలకు రాజ్యాంగం, చట్టాల ద్వారా కల్పించబడ్డాయని, వాటిని పరిరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, పౌష్టికాహారం, తగిన రక్షణ కల్పించడంతో పాటు వారు ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు.
ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో ఉన్న చట్టంతో విభేదించిన బాలలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకొని మంచి మార్గంలో పయనించాలని సూచించారు. జీవితం ప్రతి ఒక్కరికీ ఎన్నో అవకాశాలను కల్పిస్తుందని, గతంలో జరిగిన తప్పులే భవిష్యత్తును నిర్ణయించవని, కృషి, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు.
ఒకప్పుడు దొంగగా జీవించిన రత్నాకరుడు తన జీవితాన్ని మార్చుకొని మహర్షి వాల్మీకి మారి రామాయణాన్ని రచించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన విషయాన్ని ఉదహరించారు. కోరికలను జయించి, చెడు ఆలోచనలకు దూరంగా ఉండి, మంచి లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడే జీవితంలో నిజమైన విజేతలుగా నిలుస్తారని బుద్ధుని బోధనలను గుర్తుచేస్తూ బాలల్లో స్ఫూర్తి నింపారు.
జిల్లా సంక్షేమ అధికారిణి శ్రీమతి రాజమణి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, బాలల భవిష్యత్తుతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని పేర్కొన్నారు. బాలల హక్కులు, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ యువజన అవార్డు గ్రహీత మరియు డా. ఆకులపల్లి మధు బాలలను ఉద్దేశించి మాట్లాడుతూ గతాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదని కానీ భవిష్యత్తును తమకు అనుకూలంగా మలుచుకునే శక్తి బాలలకు ఉందని దానికి అనుకూలంగా తమ భవిష్యత్తును రూపుదిద్దుకోవాలని చెప్పారు.
బాలల వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం మరియు వివిధ బాలల సంరక్షణ సంస్థల్లోని బాలలకు వ్యాసరచన, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, చెస్, క్యారమ్స్ తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన బాలలకు జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం నిర్వాహకురాలు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPU) శ్రీమతి బత్తిని కళ్యాణి, బాలల సంక్షేమ సమితి సభ్యురాలు షాహిదా బేగం, డీసీపీయూ సిబ్బంది రాజుల సుమన్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది సుష్మ, ఏహెచ్‌టీయూ పీసీ రామారావు, షేర్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది జన్ను ప్రభాకర్, ప్రశాంతి, కల్పన, పరిశీలన గృహం సిబ్బంది, బాలలు తదితరులు పాల్గొన్నారు.




