Warangal: ఎల్‌నినో ప్రభావంపై రైతులు, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి!

Warangal: వరంగల్ జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు ఆదేశాలు. శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ సమర్పించాలని స్పష్టీకరణ.

Narender, Staff Reporter  -Warangal
Published on: 31 Oct 2026 7:14 AM IST
Warangal
X

Warangal: ఎల్‌నినో ప్రభావంపై రైతులు, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి!

Warangal: జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఎల్‌నినో ప్రభావంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికలు (యాక్షన్ ప్లాన్) రూపొందించి, చేపట్టాల్సిన నివారణా చర్యల వివరాలతో నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావం, దాని వల్ల కలిగే వాతావరణ మార్పులు, వ్యవసాయంపై పడే ప్రభావం తదితర అంశాలపై ప్రజలకు, ముఖ్యంగా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు చర్యలపై ప్రజలకు వివరించాలని తెలిపారు.

ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి (TSS) కళాకారులు ఎల్‌నినోపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పాటల సీడీని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆవిష్కరించారు.

తూర్పు నియోజకవర్గం టీమ్ లీడర్ జూపాక శివ, గౌరారపు యుగంధర్ తమ కళాబృందంతో రూపొందించిన ఈ పాటల ద్వారా ఎల్‌నినో ప్రభావం వలన తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, రైతులు పాటించాల్సిన వ్యవసాయ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా, దాని ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై రైతులకు స్పష్టమైన సమాచారం అందించాలని అన్నారు.

శాఖల వారీగా అనగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ, విద్యుత్, గ్రౌండ్ వాటర్, పశుసంవర్థ శాఖలు తయారు చేసిన నివేదికల ఆదరంగా ప్రజలకు కళాకారులు తమ పాటల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి,ఎలక్ట్రిసిటీ ఎస్ ఇ ఆనందం సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.