Warangal: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు వరంగల్ కలెక్టర్ ఆదేశం
Warangal: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద రోడ్ సేఫ్టీ సమావేశంలో ఆదేశించారు.
Warangal: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు వరంగల్ కలెక్టర్ ఆదేశం
వరంగల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించి ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 20 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వాటిలో 17 జాతీయ రహదారులపై ఉన్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు గల కారణాలను క్షేత్రస్థాయిలో విశ్లేషించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలతో సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
*ఎంజీఎం నుంచి వెంకట్రామ జంక్షన్ వరకు దెబ్బతిన్న రహదారిని పునరుద్ధరించాలి
ఎంజీఎం నుంచి వెంకట్రామ జంక్షన్ వరకు మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టిన పైప్‌లైన్ నిర్మాణ పనుల వల్ల దెబ్బతిన్న రహదారిని తిరిగి యథాస్థితికి తీసుకురావాలని రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. రహదారి దెబ్బతినడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా, రహదారిని పునరుద్ధరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
*నర్సంపేటలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
నర్సంపేట ప్రాంతంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో, ఆయా సమయాల్లో ప్రమాదాలకు గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితులను గుర్తించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
*రహదారులపై భారీ వాహనాల పార్కింగ్‌ను నియంత్రించాలి
మద్యం దుకాణాల సమీపంలో భారీ వాహనాలను రహదారులపై పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నట్లు సమావేశంలో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సూచించారు.
రోడ్డు భద్రతా నిబంధనల అమలుపై సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు.
ఈ రోడ్డు భద్రత కమిటీ సమావేశం లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్,ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, నేషనల్ హైవే పిడి భరద్వాజ్,ఆర్ అండ్ బి ఇఇ రాజేందర్, సంబధిత ఏ సి పి లు,ట్రాఫిక్ అధికారులు,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారు, తదితర రోడ్ భద్రత కమిటీ సభ్యులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




