Warangal: అంగన్‌వాడీ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి

Warangal: వరంగల్ జిల్లాలో అంగన్‌వాడీ సేవల మెరుగుదలపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష. ప్రతి కేంద్రాన్ని సందర్శించాలని, ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశం.

MD. AMEER, WARANGAL EAST
Published on: 23 Oct 2026 7:24 PM IST
Warangal
X

Warangal: అంగన్‌వాడీ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి

వరంగల్: వరంగల్ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడంతో పాటు చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రీ-స్కూల్ విద్య, మహిళా శిశు సంరక్షణ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఐసీడీఎస్ పరిధిలోని సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, జిల్లా సంక్షేమ అధికారితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, ప్రీ-స్కూల్ విద్య, చిన్నారుల ఆరోగ్యం, మహిళలు, శిశువుల సంరక్షణ తదితర అంశాలపై సమీక్షించారు.

సెప్టెంబర్ నెలలో సూపర్‌వైజర్లు నిర్వహించిన అంగన్‌వాడీ కేంద్రాల సందర్శనలను సమీక్షించిన కలెక్టర్, రాబోయే రెండు నెలల్లో జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రాన్ని తప్పనిసరిగా సందర్శించి, లోపాలను గుర్తించి పనితీరును మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సీడీపీవోలను ఆదేశించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్ పిల్లల హాజరును పెంచాలని, అంగన్‌వాడీ టీచర్లు ప్రీ-స్కూల్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పిల్లలను కేంద్రాలకు తీసుకురావడంలో అంగన్‌వాడీ ఆయాలు చొరవ చూపాలని స్పష్టం చేశారు.

జిల్లాలోని 447 స్నేహ క్లబ్‌లలో 4,000 మందికి పైగా కిశోర బాలికలు ఉన్న నేపథ్యంలో, సూపర్‌వైజర్లు ఆయా క్లబ్‌లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బాల్యవివాహాలు, బాలలపై వేధింపులు తదితర అంశాలపై బాలికలకు అవగాహన కల్పిస్తూ, వారి రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

వికలాంగుల అవసరాలను గుర్తించి, అర్హులైన చిన్నారులను భవిత కేంద్రాలకు అనుసంధానం చేయాలని కలెక్టర్ తెలిపారు. చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది సమ్మె నేపథ్యంలోనూ ఏ చిన్నారికి టీకాలు మిస్ కాకుండా సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో గృహ సందర్శనలు సమర్థవంతంగా నిర్వహించాలని, మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సంరక్షణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావాలపై అప్రమత్తంగా ఉండాలి

ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. తాగునీటి లభ్యతను నిర్ధారించడంతో పాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.

ఎండ తీవ్రత నుంచి చిన్నారులను రక్షించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో తాగునీరు, పోషకాహార సరఫరా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్,జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి, సంబంధిత సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST