Warangal: 84 విద్యుత్ మోటార్ల చోరీ ముఠా పట్టివేత

Warangal: వ్యవసాయ మోటార్లు దొంగిలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, రూ.18.44 లక్షల విలువైన 84 మోటార్లతో పాటు వాహనాలను నర్సంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Nov 2026 5:06 PM IST
Warangal
X

Warangal: 84 విద్యుత్ మోటార్ల చోరీ ముఠా పట్టివేత

వరంగల్: వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ నీటి మోటార్లను అపహరిస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, మరో నలుగురు బాలురను (CCL) అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.18,44,800 విలువైన 84 విద్యుత్ నీటి మోటార్లతో పాటు, దొంగతనాలకు ఉపయోగించిన నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో నర్సంపేట సబ్ ఇన్‌స్పెక్టర్ రాజన్ బాబు తన సిబ్బందితో కలిసి రాజుపేట క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వరంగల్ CCS పోలీసుల సహకారంతో విచారించగా, నిందితులు DJ ఆపరేటర్లుగా, స్టేజ్ డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు వెల్లడైంది. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపూర్, నెక్కొండ, ములుగు మండలాల పరిధిలోని శివారు గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ నీటి మోటార్లను దొంగిలిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు.

దొంగిలించిన మోటార్లను విక్రయించేందుకు రాజుపేట గ్రామ శివారులోని చెట్ల పొదల్లో దాచిపెట్టినట్లు నిందితులు వెల్లడించడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 84 విద్యుత్ నీటి మోటార్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన ప్రధాన నిందితులు:

1. హంస ప్రశాంత్ (27)

2. అన్న శివప్రసాద్ (22)

3. ఎస్.కె. దస్తగిరి అలియాస్ షైర్ (20)

వీరితో పాటు మరో నలుగురు బాలురను (CCL) అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

1. 84 విద్యుత్ నీటి మోటార్లు – విలువ సుమారు రూ.18,44,800.

2. ట్రాలీ ఆటో – 1

3. ప్యాసింజర్ ఆటో – 1

4. పల్సర్ మోటార్ సైకిల్ – 1

5. షైన్ మోటార్ సైకిల్ – 1

రైతులకు పోలీసుల సూచన:

రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సూచించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినా, మోటార్ల దొంగతనాలు జరిగినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. దొంగతనాల నివారణకు పోలీసులకు సహకరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఈస్ట్ జోన్ డిసిపి నగదు రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీబీ రవీందర్ రెడ్డి నర్సంపేట ఇన్స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ రాజన్ బాబు సిసిఎస్ ఇన్స్పెక్టర్ లు హరికృష్ణ రాఘవేందర్రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్