Jangaon: 22-A భూములపై విచారణ జరపాలి: జనగామ కలెక్టర్‌కు కాంగ్రెస్ లేఖ

Jangaon: జనగామ జిల్లాలో 22-A నిషేధిత భూములు, కీలక నేతల ఆస్తుల రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్ యాదవ్ కలెక్టర్‌ను కోరారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 18 Sept 2026 6:14 PM IST
Jangaon
X

Jangaon: 22-A భూములపై విచారణ జరపాలి: జనగామ కలెక్టర్‌కు కాంగ్రెస్ లేఖ

Jangaon: జనగామ జిల్లా పరిధిలో 22-A నిబంధనలకు సంబంధించిన భూములు, ఆస్తుల రికార్డులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములు, లావాదేవీలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ శ్రీ నూక కిరణ్ యాదవ్ గారు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ గారికి లేఖ సమర్పించారు.

జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ మాజీ ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి లేదా సంబంధిత వ్యక్తుల పేర్లపై జనగామ జిల్లా పరిధిలో నమోదైన భూములు, ఆస్తులకు సంబంధించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను నిబంధనల ప్రకారం పరిశీలించాలని ఆయన కోరారు.

అలాగే 22-A జాబితా, పహాణీలు, ROR, భూ భారతి/ధరణి రికార్డులు, పట్టాదార్ పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ రికార్డులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ లేదా ఇతర నిషేధిత కేటగిరీలకు చెందిన భూములు నిబంధనలకు విరుద్ధంగా బదలాయించబడ్డాయా అనే అంశంపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

“ఎవరి మీదా ముందస్తుగా ఆరోపణలు చేయడం మా ఉద్దేశం కాదు. సంబంధిత భూములు, ఆస్తుల రికార్డులను అధికారికంగా పరిశీలించి, ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి” అని టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ యాదవ్ తెలిపారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON