Station Ghanpur: అనుమతి లేని టపాసుల నిల్వలు సీజ్: ముగ్గురిపై కేసు
Station Ghanpur: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన రూ.12.12 లక్షల విలువైన టపాసులను టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Station Ghanpur: అనుమతి లేని టపాసుల నిల్వలు సీజ్: ముగ్గురిపై కేసు
స్టేషన్ ఘన్‌పూర్: ప్రభుత్వ అనుమతులు లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా టపాసులు నిల్వ చేసిన మూడు దుకాణాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని శివునిపల్లి, ఎస్సీ కాలనీలో టాస్క్‌ఫోర్స్, ఘన్‌పూర్ పోలీసులు సోమవారం సంయుక్తంగా దాడులు నిర్వహించి రూ.12,12,830 విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నారు.
శివునిపల్లిలో బెల్ది సంతోష్ దుకాణంలో రూ.4,08,000, పార్శి యశ్వత్ దుకాణంలో రూ.5,29,830 విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎస్సీ కాలనీలో ఆకుల గోపాల్ దుకాణంలో రూ.2,75,000 విలువైన టపాసులను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, తగిన రక్షణ చర్యలు పాటించకుండా టపాసులు నిల్వ చేసినట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. ఈ మేరకు ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.




