Jangaon: ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన టీయూఎఫ్!
Jangaon: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని టీయూఎఫ్ నాయకులు పరామర్శించారు.
Jangaon: ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన టీయూఎఫ్!
Jangaon: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో కీర్తిశేషులు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీ యు ఎఫ్) నాయకులు పరామర్శించారు. లక్ష్మణ్ గౌడ్ తండ్రి మల్లయ్య గౌడ్‌ను కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా టీ యు ఎఫ్ రాష్ట్ర సెక్రటరీ జనరల్, జిల్లా అధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి మాట్లాడుతూ.. వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి ఆ కుటుంబానికి తీరని లోటని, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న వేదనను మాటల్లో వర్ణించలేమని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మణ్ గౌడ్ 2006 నుండి తెలంగాణ సాధన కొరకు అలుపెరుగని పోరాటం చేశారు అలాంటి వ్యక్తి ఇలా ఆత్మ హత్య చేసుకోవడం బాధాకరం ఇలాంటి విషాద సమయంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మంది అమరవీరులు చేసిన ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో ఉద్యమకారులకు ఆశించిన గుర్తింపు, గౌరవం లభించకపోవడం బాధాకరమని సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తమ జీవితాలను, కుటుంబాలను సైతం పక్కనపెట్టి పోరాడిన అసలైన ఉద్యమకారులకు గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ సరైన న్యాయం చేయలేకపోయాయని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అర్హులైన ఉద్యమకారులందరికీ ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించాలని కోరారు.
అదేవిధంగా వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన భార్య స్వప్నకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి కుటుంబానికి జీవన భరోసా కల్పించాలని కోరారు. కేవలం సానుభూతి ప్రకటనలకే పరిమితం కాకుండా, బాధిత కుటుంబానికి ఆచరణాత్మకంగా న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
టీ యు ఎఫ్ ఫౌండర్ డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక కుటుంబంలో ఆత్మీయుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేని విషాదమని అన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి కలిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. మల్లయ్య గౌడ్‌తో పాటు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, లక్ష్మణ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమం లో పాల్గొన్న వారు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్యామల, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, రాష్ట్ర నాయకులు, జోగు అంజన్న, దయానంద్, జిల్లా అధ్యక్షుడు రాజు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఆరే రమేష్ రెడ్డి
జమ్మికుంట టౌన్ అధ్యక్షులు మద్దూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.




