Telangana: రబీలో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయొద్దు: భట్టి విక్రమార్క!

Telangana: ఎల్‌నినో ప్రభావంతో రబీలో వరి సాగు వద్దని, స్వల్పకాలిక ఆరుతడి పంటలే వేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 12 Oct 2026 5:56 PM IST
Telangana
X

Telangana: రబీలో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయొద్దు: భట్టి విక్రమార్క!

తెలంగాణ: ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రబీ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోను రైతులు వరి సాగు చేయవద్దని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులతో కలిసి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల్లోని రైతు వేదికల్లో పాల్గొన్న సంబంధిత శాఖల అధికారులు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

దామెర మండల కేంద్రంలోని రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఎల్ నినో పరిస్థితుల కారణంగా నీటి లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. కాబట్టి నీటిని పొదుపుగా వినియోగించడం వలన బిందు సేద్యంతో పామ్ తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయవచ్చన్నారు.

జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోర్వెల్స్ రీఛార్జ్, తదితర పనులను చేపట్టి జలవనరులను కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో 315 మండలాల్లో వర్షపాతం తక్కువగా ఉందని, ప్రభుత్వం త్వరలోనే కరువు మండలాలను ప్రకటిస్తుందన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటి సమస్యలు ఉత్పన్నమవ్వకుండా నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు.

భూగర్భ జల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ నివేదికలను అందజేయాలన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అనుసరించి రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు.

ఎల్ నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. కాబట్టి రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ కల్పన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శేషాద్రి, ,జిల్లా,వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర, డీఆర్డీవో మేన శ్రీను, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి ఎంపీడీఓ కల్పన , మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.