Hanumakonda: యువతలో ఓటు హక్కు ప్రాధాన్యం పెంచాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి!
Hanumakonda: యువతలో ఓటు హక్కుపై అవగాహన కోసం ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ద్వారా వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలని తెలంగాణ సీఈవో సి. సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
Hanumakonda: యువతలో ఓటు హక్కు ప్రాధాన్యం పెంచాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి!
హనుమకొండ: గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) భారత ఎన్నికల సంఘం యువతలో ఎన్నికల అవగాహనను పెంపొందించేందుకు చేపట్టిన కొత్త కార్యక్రమాల్లో భాగంగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యువతలో ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల (ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌లు) ద్వారా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ పోటీలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో నవంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలల స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. అనంతరం నవంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో, నవంబర్ 16 నుంచి 18వ తేదీ వరకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు.
విద్యార్థుల్లో ఎన్నికల వ్యవస్థపై అవగాహన పెంపొందించడం, ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, బాధ్యతాయుతమైన ఓటర్లుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థపై తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ద్వారా ఈ పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
యువతలో ఎన్నికల అక్షరాస్యతను పెంపొందించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని, ఎన్నికల ప్రక్రియలో చైతన్యవంతమైన యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డిఎస్ వెంకన్న, తహసిల్దార్లు రవీందర్ రెడ్డి, భావ్ సింగ్ , ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.




