Jangaon: భూసేకరణ పనులను వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jangaon: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 21 Sept 2026 6:21 PM IST
Jangaon
X

Jangaon: భూసేకరణ పనులను వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

జనగామ జిల్లా: రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సోమవారం, హైదరాబాదు నుంచి రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం–పునరావాస పునరుద్ధరణ (ఆర్‌అండ్‌ఆర్‌) పనుల పురోగతిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనులకు అవసరమైన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. నీటిపారుదల శాఖకు కేటాయించిన నిధులకు అదనంగా ఇతర వనరుల నుంచి నిధులను బదిలీ చేసి అవసరమైన మేరకు నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

2026–27 ఆర్థిక సంవత్సరంలో భూసేకరణకు మొత్తం రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.1,050 కోట్లు, మరోసారి రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.2,550 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్లు భూసేకరణ లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిధులు సరిపోకపోయినా, ఇతర కారణాల వల్ల చెల్లింపులు సాధ్యం కాకపోయినా ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి, అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.

భూసేకరణ పనులకు ప్రత్యేక అధికారులను నియమించి, బాధ్యతలు అప్పగించాలని, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని పనులను పూర్తి చేయాలని సూచించారు.

నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు రెవెన్యూ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ భూసేకరణ పురోగతిని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఇప్పటికే విడుదలైన రూ.2,550 కోట్లను పూర్తిగా వినియోగించిన అనంతరం అవసరాన్ని బట్టి అదనపు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

భూసేకరణ ప్రక్రియలో రైతుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు రైతులతో నేరుగా చర్చించి స్నేహపూర్వక వాతావరణంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ నిబంధనల ప్రకారం జరగాలని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పరిహారం మార్కెట్ విలువకు సాధ్యమైనంత సమీపంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భూసేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే హైదరాబాద్‌లోని భూసేకరణ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే అవార్డులు జారీ చేసిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపులను మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి, పనులను వేగవంతం చేయాలని సూచించారు

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులకు సంబంధించి సుమారు రూ.3,100 కోట్ల విలువైన పనులు గుర్తించగా, రూ.2,514 కోట్ల మేర నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.

పరిహారం నేరుగా రైతులకు చేరేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుని భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ ఎస్ఈ సీతారాం, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON