Rayaparthy: రాయపర్తి మండలం కొత్తూరులో ఘనంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహణ!
Rayaparthy: రాయపర్తి మండలం కొత్తూరులో గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వికసిత గ్రామ ప్రణాళిక, పరిశుభ్రతపై అధికారులు దిశానిర్దేశం చేశారు.
Rayaparthy: రాయపర్తి మండలం కొత్తూరులో ఘనంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహణ!
Rayaparthy: రాయపర్తి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కందికట్ల స్వప్న సంతోష్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా డివిజనల్ పంచాయతీ అధికారి (DLPO) వేదవతి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) పాక శ్రీనివాసులు, మండల పంచాయతీ అధికారి (MPO) కూచన ప్రకాష్ తదితరులు హాజరయ్యారు.
సభ ప్రారంభంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేసి, పారిశుధ్య కార్మికులను, ఉత్తమ సేవలందించిన స్వయం సహాయక సంఘాల మహిళలను సత్కరించారు. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు రిసోర్స్ మ్యాప్ మరియు సోషల్ మ్యాపు వేసి గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక తయారు చేయుటకు పనులను గుర్తించినారు
ఈ సందర్భంగా ముఖ్య అతిథి, డివిజనల్ పంచాయతీ అధికారి వేదవతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి ప్రణాళికలను గ్రామసభల ద్వారానే పారదర్శకంగా తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామసభల తీర్మానాలు, వివరాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ‘నిర్ణయ్’ (NIRNAY) యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఎంపీడీఓ పాక శ్రీనివాసులు, ఎంపీఓ కూచన ప్రకాష్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అర్హుడికీ పని కల్పించడం జరుగుతోందని, రాబోయే సంవత్సరానికి సంబంధించిన పనుల గుర్తింపు (Shelf of Works) గ్రామసభ ద్వారానే ఆమోదించడం జరిగిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి ‘లఖ్‌పతీ దీదీ’లుగా ఎదగాలని, అందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో తడి-పొడి చెత్త వేరుచేస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
సభాధ్యక్షురాలు కందికట్ల స్వప్న సంతోష్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి బాధ్యత అని అన్నారు. కొత్తూరు (సి.పి) గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడానికి గ్రామ పంచాయతీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. గ్రామంలో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించేలా మిషన్ భగీరథ పనులను పర్యవేక్షిస్తూ, డ్రైనేజీలు, వీధి దీపాల నిర్వహణను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో గ్రామస్తులంతా భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ రమేష్, ఏపీఓ కుమార్, ఈసీ ప్రవీణ్, సాంకేతిక సహాయకులు (TA) చాగంటి ఏకాంతం, సందీప్, పంచాయతీ కార్యదర్శి అస్మా, ఉప సర్పంచ్ చిప్ప శ్రీను, గ్రామ వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, మహిళా సమాఖ్య ప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




