Mulugu: ఉద్యాన రైతులకు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో చీడపీడల నివారణ
Mulugu: ఉద్యాన పంటల్లో చీడపీడల ముందస్తు గుర్తింపునకు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఫైల్లో (అగ్రిహాక్) సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
Mulugu: ఉద్యాన రైతులకు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో చీడపీడల నివారణ
ములుగు: ఉద్యాన పంటల్లో చీడపీడల ఉధృతిని ముందుగానే గుర్తించి, రైతులకు సకాలంలో శాస్త్రీయ సలహాలు అందించేందుకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU), బెంగళూరుకు చెందిన అగ్రిహాక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫైల్లో సంస్థ) మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఉద్యాన రైతులు అవసరానికి మించి పురుగుమందులు వినియోగించకుండా నివారించవచ్చని తెలిపారు. చీడపీడల నివారణకు శాస్త్రీయ ఆధారాలతో కూడిన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సాంకేతిక వ్యవస్థలో స్మార్ట్ పెస్ట్ ట్రాప్లు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (AWS), నిర్ణయ సహాయక వ్యవస్థలను సమన్వయం చేసి పంటల్లో చీడపీడల ఉనికిని గుర్తించడంతో పాటు వాటి తీవ్రతను ముందుగానే అంచనా వేస్తారని వివరించారు. పొలాల్లో ఏర్పాటు చేసే స్మార్ట్ పెస్ట్ ట్రాప్లలోని ప్రత్యేక ఆకర్షణీయ పదార్థాల ద్వారా కీటకాలను సేకరిస్తారు. కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఇమేజ్ సాంకేతికతతో వాటిని గుర్తించి, వాటి సంఖ్యను ఆటోమేటిక్గా లెక్కిస్తారు.
ఈ వివరాలను ఆర్థిక నష్ట పరిమితి (ETL)తో పోల్చి, చీడపీడల ఉధృతి నిర్దేశిత స్థాయిని దాటినప్పుడు మాత్రమే పురుగుమందుల పిచికారీకి సంబంధించి రైతులకు సూచనలు అందిస్తారు. అలాగే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వర్షపాతం తదితర వాతావరణ వివరాలను నిరంతరం నమోదు చేసి, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు.
ఈ విధానం అమలుతో పురుగుమందుల అనవసర వినియోగాన్ని అరికట్టడంతో పాటు సాగు ఖర్చులు తగ్గుతాయని ఉపకులపతి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, మిత్ర పురుగుల సంరక్షణ, నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తుల సాధనకు ఈ సాంకేతికత దోహదపడుతుందని పేర్కొన్నారు. సరైన సమయంలో అవసరమైన మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పంట నష్టాలను తగ్గించి, రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు.
ఉద్యాన రంగంలో ఆధునిక సాంకేతికత, సుస్థిర వ్యవసాయం, డిజిటల్ సాగు దిశగా ఈ ఒప్పందం కీలక ముందడుగుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ. భగవాన్, ఫైల్లో సంస్థ సలహాదారు, మాజీ ఉపకులపతి డాక్టర్ ఎస్.డి. శిఖామణి, ఉద్యాన మరియు విద్యార్థుల వ్యవహారాల విభాగం డీన్ జె. చీనా, పరిశోధనా విభాగం సంచాలకులు డాక్టర్ డి. లక్ష్మీనారాయణ, విస్తరణ విభాగం సంచాలకులు, పీజీ అధ్యయనాల డీన్ డాక్టర్ టి. సురేష్ కుమార్, విశ్వవిద్యాలయ కన్సల్టెంట్లు డాక్టర్ కె. వీరాంజనేయులు, డాక్టర్ జి.పి. సునందిని, ప్రణాళిక మరియు పర్యవేక్షణ విభాగం సంచాలకులు డాక్టర్ డి. అనితాకుమారి, డాక్టర్ జి. సతీష్ తదితరులు పాల్గొన్నారు.




