Gudur: అటవీ అధికారుల మౌనంపై అనుమానాలు: గూడూరు
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం ఈడీసీలో సంతకాల ఫోర్జరీ, నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరపాలని చైర్మన్ డిమాండ్ చేశారు.
Gudur: అటవీ అధికారుల మౌనంపై అనుమానాలు: గూడూరు
గూడూరు: ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం ఈకో డెవలప్‌మెంట్ కమిటీ (EDC)లో చోటుచేసుకున్న ఫోర్జరీ సంతకాల ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కమిటీ నిధుల కేటాయింపు, వినియోగానికి సంబంధించి కొందరు వ్యక్తులు నకిలీ సంతకాలతో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ, అటవీశాఖ జిల్లా ఉన్నతాధికారులు మౌనం వహించడంపై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సంతకాల ఫోర్జరీ ముందే తెలుసా?
ఈడీసీ కమిటీ తీర్మానాలు, నిధుల విత్‌డ్రాయల్‌కు సంబంధించి బాధ్యులైన కొందరు వ్యక్తులు సభ్యుల ప్రమేయం లేకుండానే ఫోర్జరీ సంతకాలు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారం అధికార యంత్రాంగానికి ముందే తెలుసా? తెలిసీ చూసీ చూడనట్లు వ్యవహరించారా? లేక నిధుల గోల్‌మాల్‌లో ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ అక్రమాలు జరిగాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బాధ్యులపై చర్యలేవి?
సంతకాల ఫోర్జరీ అనేది తీవ్రమైన క్రిమినల్ నేరమైనప్పటికీ, అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై ఇప్పటివరకు ఎలాంటి శాఖాపరమైన లేదా చట్టపరమైన బాధ్యతాయుత చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనే చర్చ గుసగుసలకు దారితీస్తోంది.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వహించడం సరి కాదు- చైర్మన్ భూక్యా రజిత మంగీలాల్
భీమునిపాదం జలపాతం అభివృద్ధికి రావాల్సిన నిధులు దుర్వినియోగం కావడం, నకిలీ సంతకాలతో బిల్లులు పొందినట్లు వస్తున్న వార్తలపై సమగ్ర విచారణ జరిపించాలని ఈడిసి చైర్మన్ భూక్యా రజిత మంగీలాల్ డిమాండ్ చేశారు. ఫోర్జరీకి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, నిధుల గోల్‌మాల్‌పై నిష్పాక్షిక విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు పట్టుబడుతున్నారు.




