Warangal: నరకాసుర వధకు పటిష్ట భద్రత: వరంగల్ డీసీపీ ధార కవిత

Warangal: వరంగల్ రంగసాయిపేట ఉర్సు గుట్ట మైదానంలో నరకాసుర వధ కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీసీపీ ధార కవిత వెల్లడించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 6 Nov 2026 3:27 PM IST
Warangal
X

Warangal: నరకాసుర వధకు పటిష్ట భద్రత: వరంగల్ డీసీపీ ధార కవిత

వరంగల్: దీపావళి పండుగను పురస్కరించుకుని రంగసాయిపేట ఉర్సు గుట్ట మైదానంలో ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక నరకాసుర వధ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వరంగల్ డీసీపీ ధార కవిత తెలిపారు. ఉర్సు గుట్ట మైదానంలో ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఈ వేడుకను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత శాంతియుతంగా, ఘనంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని తెలిపారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్, జీడబ్ల్యూఎంసీ తదితర శాఖల సమన్వయంతో ఉత్సవ వేదిక వద్ద అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు.

శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేవలం లా అండ్ ఆర్డర్ బలగాలే కాకుండా ట్రాఫిక్, క్రైమ్స్ విభాగాలు మరియు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా 'షీ టీమ్స్'ను రంగంలోకి దించనున్నామని వెల్లడించారు.

పార్కింగ్ స్థలాలు, ఎంట్రీ గేట్లు, క్యూ లైన్ల ఏర్పాట్లు పూర్తి చేశామని, మైదానం చుట్టూ ఉన్న రోడ్లు, పార్కింగ్ ఏరియాలు, గ్రౌండ్ మొత్తాన్ని సీసీటీవీ సర్వైలెన్స్‌తో అనుసంధానించామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు.

గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత మెరుగైన వసతులు కల్పించినట్లు డీసీపీ తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు సమయపాలన పాటించాలని, పోలీసుల సూచనలు పాటించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పాల్గొనేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఏర్పాట్లపై స్థానిక పోలీసు అధికారులకు డీసీపీ పలు సూచనలు చేశారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST