Jangaon: వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్ సందీప్ కుమార్

Jangaon: జనగామలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. వృద్ధులను ఆదరించడం పిల్లల బాధ్యతని, చట్టపరమైన రక్షణలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 1 Oct 2026 2:13 PM IST
Jangaon
X

Jangaon: వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్ సందీప్ కుమార్

జనగామ జిల్లా: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ఆరంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని International Day of Older Persons నిర్వహిస్తున్నామని తెలిపారు. వృద్ధుల పట్ల సమాజంలో గౌరవం, బాధ్యత, ఆప్యాయత పెంపొందించడంతో పాటు, వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం వైద్య, ఆరోగ్య రంగాల్లో వచ్చిన అభివృద్ధి కారణంగా ప్రజల సగటు ఆయుష్షు పెరుగుతోందని, సుమారు 60 సంవత్సరాల వయసులో ఉద్యోగ విరమణ చేసిన అనంతరం కూడా మరో రెండు దశాబ్దాల పాటు జీవించే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల వృద్ధాప్య దశలో వారి ఆరోగ్యం, ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, కుటుంబ సంరక్షణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడతారని, వృద్ధాప్యంలో వారికి అండగా నిలవడం పిల్లల నైతిక, సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులు, వృద్ధ పౌరుల పోషణ, సంక్షేమ చట్టం, 2007 Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 ను అమలు చేస్తోందని తెలిపారు. ఈ చట్టం ద్వారా వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ, భద్రతకు చట్టపరమైన రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు.

వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే, వారి నుంచి నిర్వహణ భృతి Maintenance పొందేందుకు చట్టపరమైన అవకాశం ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన ఆర్థిక, వైద్య, మానసిక సహకారం అందించాలన్నారు.

అలాగే, వృద్ధ తల్లిదండ్రులు తమ ఇల్లు లేదా ఆస్తిని పిల్లలకు బదలాయించిన అనంతరం పిల్లలు వారిని సంరక్షించకపోతే, Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007లోని సెక్షన్ 23 ప్రకారం నిర్దిష్ట పరిస్థితుల్లో ఆ బదలాయింపును రద్దు చేసి, ఆస్తిని తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం, తల్లిదండ్రుల సంరక్షణకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపడుతోందని వివరించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ అందిస్తూ, ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని వెల్లడించారు. అర్హులైన వృద్ధులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పింఛన్ ప్రయోజనాలను పొందాలని సూచించారు.

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ కేంద్రాలు వృద్ధులకు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు వృద్ధులు అక్కడకు వచ్చి పరస్పరం మాట్లాడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, పుస్తకాలు చదవడం వంటి కార్యకలాపాలకు అవకాశం ఉంటుందన్నారు.

వృద్ధులకు సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు, సహాయం అవసరమైన సందర్భాల్లో 14567 టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సేవ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

వృద్ధులు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వృద్ధులు కుటుంబానికి, సమాజానికి అందించిన సేవలు, అనుభవం, జ్ఞానాన్ని గుర్తించి, వారికి గౌరవం ఇవ్వాలని సూచించారు. వృద్ధులను కేవలం కుటుంబ బాధ్యతగా కాకుండా సమాజానికి విలువైన మార్గదర్శకులుగా గుర్తించాలని పేర్కొన్నారు.

వృద్ధుల హక్కులను పరిరక్షించడం, వారికి భద్రత కల్పించడం, అవసరమైన వైద్య, ఆర్థిక సహాయం అందించడం, కుటుంబంలో వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

అనంతరం అదనపు కలెక్టర్ రెవెన్యూ మాట్లాడుతూ.. వృద్ధుల పట్ల సమాజం బాధ్యతను గుర్తుచేసే విధంగా ఈ రోజును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది “దీర్ఘ ఆయువు యుగం” అనే సందేశంతో వృద్ధుల పట్ల గౌరవం, వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, సామాజిక భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ప్రస్తుతం సమాజంలో సుమారు 10 శాతం మంది వృద్ధులు ఉన్నారని, రాబోయే 20 సంవత్సరాల్లో వృద్ధుల జనాభా 20 శాతం నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారని తెలిపారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారి ఆరోగ్యం, ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ, గౌరవప్రదమైన జీవనం వంటి అంశాలపై ప్రభుత్వంతో పాటు సమాజం కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే అటల్ వాయు అభ్యుదయ యోజన కింద మల్టీ డే కేర్ సెంటర్ల ద్వారా వృద్ధులు ఒంటరితనానికి గురికాకుండా, వారికి అవసరమైన సహాయం అందేలా డే కేర్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

అదే విధంగా ప్రణామ్ డే కేర్ సెంటర్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రతిరోజూ సుమారు 50 నుంచి 60 మంది వృద్ధులకు అవసరమైన సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో వృద్ధులకు ఆశ్రయం, ఆహారం, వైద్య సహాయం, తదితర సౌకర్యాలను అందిస్తూ వారి ఆరోగ్యం భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.

వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వృద్ధులకు అవసరమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు వందన స్కీమ్ వంటి ఆరోగ్య సంబంధిత సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, వృద్ధులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

పిల్లలు లేదా కుటుంబ సభ్యులు వృద్ధులను సరిగా చూసుకోకపోయినా వారికి అవసరమైన ఆహారం, నివాసం, వైద్యం లేదా ఇతర ప్రాథమిక అవసరాలను అందించకపోయినా వృద్ధులు న్యాయపరమైన రక్షణ పొందేందుకు చట్టంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని తెలిపారు.

ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, సేవలు, చట్టపరమైన హక్కులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

వృద్ధుల సంక్షేమం సమాజ బాధ్యత అనే స్ఫూర్తితో ప్రతి వృద్ధుడికి గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన, భద్రమైన జీవనం అందేలా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అదే విధంగా వక్తలు మాట్లాడుతూ వృద్ధులు కుటుంబానికి, సమాజానికి అందించిన సేవలు, అనుభవం, జ్ఞానం ఎంతో విలువైనవని పేర్కొంటూ, వృద్ధుల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలని, వారికి అవసరమైన సమయంలో సహకారం అందించాలని తెలిపారు.

వృద్ధుల పట్ల గౌరవం, ప్రేమ, బాధ్యతతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. వృద్ధులు కుటుంబానికి భారంగా కాకుండా, కుటుంబానికి మార్గదర్శకులుగా, అనుభవజ్ఞులుగా భావించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు.

తదనంతరం వృద్ధులతో కలిసి వారు కేక్‌ కట్‌ చేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, డీఎంహెచ్ఓ వాణిశ్రీ, కన్సల్టెంట్ మైత్రేయి, డీఎం ఆర్టీసీ ఉషా, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మమత, ఏపీడీ నూరుద్దీన్, డీపీఎం నళిని, జ్యోతి, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, జిల్లాలోని ఆయా మండలాల వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON