Mulugu: పెండింగ్ 6 డీఏలు, పీఆర్సీని వెంటనే అమలు చేయాలి: పీఆర్‌టీయూ!

Mulugu: ఉద్యోగులకు ప్రభుత్వం చేస్తున్నది మోసమా, నిర్లక్ష్యమా?: పెండింగ్‌లో ఉన్న 6 డీఏలు, మూడేళ్ల పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని పీఆర్‌టీయూ ములుగు జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సురేందర్ డిమాండ్.

PONNALA SWAMY, MULUGU
Published on: 23 Sept 2026 8:48 PM IST
Mulugu
X

Mulugu: పెండింగ్ 6 డీఏలు, పీఆర్సీని వెంటనే అమలు చేయాలి: పీఆర్‌టీయూ!

ములుగు: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అత్యంత నిరాశాజనకంగా ఉందని పిఆర్టియూ తెలంగాణ ములుగు జిల్లా అధ్యక్షులు కొయ్యడ సురేందర్ తీవ్రంగా విమర్శించారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం హామీలు ఇవ్వడం.. గడువులు చెప్పడం.. మళ్లీ వాటిని వాయిదా వేయడం ద్వారా ఉద్యోగులను అయోమయానికి గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు.

“ఉద్యోగులకు రావాల్సిన డీఏలను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పెట్టడం ఏమిటి?

మూడేళ్లుగా పీఆర్సీని అమలు చేయకుండా కాలయాపన చేయడం ఏమిటి? ఉద్యోగులకు ఒకటి చెబుతూ, అమలు విషయంలో మరోలా వ్యవహరించడం మోసం కాదా? ఉద్యోగుల సమస్యల పట్ల ఇది నిర్లక్ష్యం కాదా?” అని కొయ్యడ సురేందర్ ప్రశ్నించారు.

హామీలతో ఉద్యోగులను మభ్యపెట్టడం ఆపాలి

ఒక డీఏను అక్టోబర్ నెల జీతంలో, మరో డీఏను ఉగాది సందర్భంగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో, మిగిలిన డీఏలు మరియు పీఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

“హామీలు ఇచ్చి ఉద్యోగులను నమ్మించడం.. ఆ తర్వాత గడువులు మార్చడం.. చివరకు మళ్లీ ప్రకటనలతో సరిపెట్టడం — ఇది ఉద్యోగుల పట్ల బాధ్యతాయుతమైన వైఖరి కాదు. ఇటువంటి కాలయాపన వల్ల ఉద్యోగుల విశ్వాసం దెబ్బతింటోంది” అని ఆయన అన్నారు.

ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఏదో దయతో ఇచ్చే వరాలుగా భావించకూడదని, అవి ఉద్యోగుల న్యాయమైన హక్కులని కొయ్యడ సురేందర్ స్పష్టం చేశారు.

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు

రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులు, కుటుంబ బాధ్యతల మధ్య ఉద్యోగులు తమ విధులను నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, అలాంటి ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, పీఆర్సీని పెండింగ్‌లో పెట్టడం ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.

“ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకోవడం లేదు. తమకు రావాల్సిన హక్కులను అడుగుతున్నారు. ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టి, పీఆర్సీని మూడేళ్లుగా నిలిపివేసి, మళ్లీ హామీలతో కాలం గడపడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు.

మాటలు కాదు.. తక్షణ అమలు కావాలి

ఇకనైనా ప్రభుత్వం మాటల మాయాజాలం, ప్రకటనల కాలయాపన, హామీల రాజకీయాన్ని పక్కనపెట్టి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని పిఆర్టియూ తెలంగాణ డిమాండ్ చేస్తోందన్నారు.

ఆరు డీఏలను పూర్తిగా విడుదల చేయాలి. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. ఇచ్చిన హామీలను మాట తప్పకుండా నిలబెట్టుకోవాలి. ఉద్యోగ–ఉపాధ్యాయ వర్గాల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి. లేనిపక్షంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల్లో ఉన్న అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని కొయ్యడ సురేందర్ తెలిపారు.

“ఇక హామీలు వద్దు.. అమలు కావాలి. ఇక ప్రకటనలు వద్దు.. ఉత్తర్వులు కావాలి. ఇక కాలయాపన వద్దు.. పీఆర్సీ కావాలి. ఇక నిర్లక్ష్యం వద్దు.. ఉద్యోగులకు న్యాయం కావాలి.

ఉద్యోగ–ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధన కోసం పిఆర్టియూ తెలంగాణ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని పిఆర్టియూ తెలంగాణ ములుగు జిల్లా అధ్యక్షులు కొయ్యడ సురేందర్ స్పష్టం చేశారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU