Warangal: వరంగల్ ప్రజావాణిలో కలకలం..పెట్రోల్ పోసుకున్న పిటిషనర్, కలెక్టర్ స్పందన!
Warangal: వరంగల్ ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదంటూ పెట్రోల్ పోసుకున్న దుగ్గొండి మండలానికి చెందిన గట్ల సురేందర్. వాగ్మూలం తీసుకున్న కలెక్టర్ సత్య శారద.
Warangal: వరంగల్ ప్రజావాణిలో కలకలం..పెట్రోల్ పోసుకున్న పిటిషనర్, కలెక్టర్ స్పందన!
Warangal: ప్రజావాణి కార్యక్రమంలో పిటిషన్ సమర్పించిన దుగ్గొండి మండలం పోనకల్ గ్రామానికి చెందిన గట్ల సురేందర్, తండ్రి మంకయ్య, సోమవారం ఆవేదనతో పెట్రోల్ పోసుకున్న ఘటన చోటుచేసుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిటిషనర్‌తో మాట్లాడి వివరాలను తెలుసుకుని, ఆయన నుంచి స్వయంగా వాగ్మూలాన్ని నమోదు చేయించారు.
గట్ల సురేందర్ తన సమస్యకు సంబంధించి 06.07.2026న ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించారు. దీనిపై జిల్లా కలెక్టర్ 22.08.2026న జిల్లా కలెక్టరేట్‌లో విచారణ (హియరింగ్) నిర్వహించారు. ఈ విచారణకు పిటిషనర్ తమ్ముడు గట్ల రాజు హాజరయ్యారు.
విచారణ సందర్భంగా సంబంధిత అంశంపై నర్సంపేట సివిల్ జడ్జి కోర్టులో కేసు నంబర్ 199/224 పెండింగ్‌లో ఉన్నందున, కోర్టు తీర్పు వెలువడిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని 30.09.2026న ఎండార్స్‌మెంట్ ద్వారా పిటిషనర్‌కు తెలియజేశారు.
అయినప్పటికీ, సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో గట్ల సురేందర్ ఆవేదనకు గురై పెట్రోల్ పోసుకున్నాడు. అనంతరం తన చర్య పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ఇలాంటి పొరపాటును ఇకపై పునరావృతం చేయనని, తనను దయతో క్షమించాలని కోరుతూ స్వయంగా వాగ్మూలం రాసి జిల్లా అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, “సమస్య ఏదైనా పరిష్కారం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సమస్యకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నందున, కోర్టు తీర్పు వెలువడే వరకు సంయమనం పాటించాలి” అని సూచించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్రయించాలని, ఆవేశంలో ఎలాంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవద్దని కలెక్టర్ సూచించారు.




