Parkal: మానవ అక్రమ రవాణా నిర్మూలనకు సమన్వయం అవసరం పరకాల ఆర్డీఓ!

Parkal: మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పరకాల ఆర్డీఓ డి.ఎస్. వెంకన్న పిలుపునిచ్చారు. త్వరలో విజిలెన్స్ కమిటీ ఏర్పాటు.

M PRABHAKAR, PARAKAL
Published on: 29 Sept 2026 4:49 PM IST
Parkal
X

Parkal: మానవ అక్రమ రవాణా నిర్మూలనకు సమన్వయం అవసరం పరకాల ఆర్డీఓ!

Parkal: మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) డి.ఎస్. వెంకన్న అన్నారు.

మంగళవారం పరకాలలోని ఆర్డీఓ కార్యాలయంలో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ, హనుమకొండ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, కార్మిక శాఖల అధికారులకు మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలన అంశాలపై సమీక్ష మరియు సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ డి.ఎస్. వెంకన్న అధ్యక్షత వహించి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి, ఆశలు చూపి కొందరు సంఘటితంగా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆర్థిక, సామాజిక బలహీనతలను ఆసరాగా చేసుకొని వారిని వెట్టిచాకిరీలోకి నెడుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి బాధితులను గుర్తించి, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పరకాల డివిజన్‌లోని ప్రతి మండలంలో మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరి నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో డివిజన్ స్థాయిలో విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా ఈ నేరాల నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడతామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం), హైదరాబాద్ నుంచి డాక్టర్ ఆనంద్ రిసోర్స్ పర్సన్‌గా పాల్గొని మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.

ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, ఇక్బాల్ పాషాతో పాటు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కార్మిక శాఖ అధికారి వినోద్ కుమార్, వరంగల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సుధాకర్, ఎఫ్‌ఎంఎం సిబ్బంది నరసింహ స్వామి, రాకేష్, ప్రదీప్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL