Parakal: చేపలు, రొయ్యల వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ
Parakal: పరకాల మండలం గొర్రెకుంటలో చేపలు, రొయ్యల వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ సత్య శారద పరిశీలించారు.
Parakal: చేపలు, రొయ్యల వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ
పరకాల: మత్స్యకారులు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ వినూత్న ఉత్పత్తుల తయారీ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం గొర్రెకుంటలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు.
ఈ సందర్భంగా చేపలు, రొయ్యల వ్యర్థ పదార్థాలతో సంఘం సభ్యులు తయారు చేసిన వర్మీ కంపోస్ట్ సేంద్రియ ఎరువును పరిశీలించి, తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తయారు చేసిన చేపల పచ్చళ్లు, రొయ్యల పచ్చళ్లను పరిశీలించారు. మహిళలు పచ్చళ్ల తయారీ విధానాన్ని వివరించగా, వారి కృషిని అభినందించారు.
అనంతరం సంఘం సభ్యుల కోరిక మేరకు స్థానిక గుండ్లకుంటను సందర్శించారు. గుండ్లకుంట సమీపంలోని ప్రభుత్వ భూమిలో ఐదు ఎకరాలు కేటాయిస్తే చేపలు, రొయ్యల వ్యర్థ పదార్థాలతో మరింత ఎక్కువ పరిమాణంలో వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేసే అవకాశం ఉంటుందని సంఘం సభ్యులు ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, మత్స్యకార సంఘం అభివృద్ధికి తనవంతు సహకారం తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు. సంఘం సభ్యులు కష్టపడి పనిచేస్తూ వినూత్న ఆలోచనలతో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, మహిళా మత్స్యకారులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మరింత విలువ జోడించేలా ఆధునిక పద్ధతుల్లో శిక్షణ కల్పిస్తామని తెలిపారు.
చేపల పచ్చళ్లు, రొయ్యల పచ్చళ్లతో పాటు ఫిష్ బాల్స్, ఫిష్ కట్లెట్స్, ఫిష్ బిర్యానీ వంటి వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో శిక్షణ పొందేందుకు సంఘం సభ్యులను హైదరాబాద్కు పంపిస్తామని హామీ ఇచ్చారు. తద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, డీఆర్డీఓ ప్రాజెక్టు డైరెక్టర్ నాగ పద్మజ, జిల్లా మత్స్యశాఖ అధికారి పిల్లి శ్రీపతి, గీసుకొండ తహసీల్దార్ రాజ్ కుమార్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, మెప్మా డీఎంసీ రేణుక, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రతినిధి చొప్పరి సోమయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధుచంద్ర, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు కళావతి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు అశోక్, సంఘం సభ్యులు, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




