Mulugu: మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు త్వరగా పంపిణీ చేయాలి!
Mulugu: మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసుల పంపిణీ పూర్తి చేయాలి: ములుగు ఆర్డీవో కృష్ణవేణి ఆదేశం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 ఆఖరు తేదీ.. పూర్తి షెడ్యూల్ వివరాలివే.
Mulugu: మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు త్వరగా పంపిణీ చేయాలి!
ములుగు: ప్రత్యేక సమగ్ర సవరణ–2026లో భాగంగా మ్యాపింగ్ కాని ఓటర్లకు సంబంధించిన నోటీసుల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల నమోదు అధికారి, ములుగు రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆర్డీవో కృష్ణవేణి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.
బుధవారం జిల్లా రెవెన్యూ కార్యాలయంలో 109–ములుగు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నమోదు అధికారి ఆర్డీవో, సమావేశం నిర్వహించి, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతి, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసుల పంపిణీ, దరఖాస్తులు, అభ్యంతరాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌పై చర్చించారు.
ప్రత్యేక సమగ్ర సవరణలో గుర్తించిన మ్యాపింగ్ కాని వ్యత్యాస కేసులకు సంబంధించి మొత్తం 41,900 నోటీసులు రూపొందించినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటివరకు 38,571 నోటీసులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన నోటీసుల పంపిణీని నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.
గత వారం నుంచి బుధవారం వరకు వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలకు సంబంధించిన జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ప్రత్యేక సమగ్ర సవరణపై ఏవైనా సూచనలు ఉంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఓటరు జాబితా సవరణకు భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను సమావేశంలో వివరించారు. 2026 నవంబర్ 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. 2023 నవంబర్ 1 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, తత్సమాన విద్యార్హత పొందిన అర్హులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నమూనా–18లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సెప్టెంబర్ 28న బహిరంగ ప్రకటన జారీ చేస్తారని, అక్టోబర్ 15న మొదటి పునఃప్రచురణ, అక్టోబర్ 25న రెండో పునఃప్రచురణ ఉంటుందని తెలిపారు. నమూనా–18 దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 6 చివరి తేదీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
నవంబర్ 25న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారని, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్ ప్రతులను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




