Mulugu: ములుగులో విద్యుత్ లైన్ల మార్పుకు రూ.3 కోట్లు మంజూరు!
Mulugu: ములుగు నియోజకవర్గంలో ఇళ్ల మీదుగా వెళ్లే విద్యుత్ లైన్ల మార్పునకు మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేస్తూ జీవో నెం. 32 జారీ చేసింది.
Mulugu: ములుగులో విద్యుత్ లైన్ల మార్పుకు రూ.3 కోట్లు మంజూరు!
ములుగు: ములుగు నియోజకవర్గంలో ఇళ్ల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్ల మార్పు, విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి మేరకు ఇంధన శాఖ ఈ నెల 8న ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 32 జారీ చేసింది.
నివాస గృహాల మీదుగా విద్యుత్ లైన్లు వెళ్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భద్రతాపరమైన సమస్యలను మంత్రి సీతక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదాల ముప్పును తగ్గించేందుకు విద్యుత్ లైన్లను మార్చాలని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.
మంత్రి సీతక్క విజ్ఞప్తికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రూ.3 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్ లైన్ల మార్పు, విస్తరణ పనులకు ఆమోదం తెలిపింది.
ఆర్థిక శాఖ సమ్మతితో జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం పనుల అమలుకు అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రి సీతక్క చొరవతో మంజూరైన ఈ నిధులతో విద్యుత్ లైన్ల మార్పు పనులు చేపట్టనున్నారు. పనులు పూర్తయితే ఇళ్ల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్లతో ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గి, ప్రజలకు భద్రత పెరగనుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి సీతక్కకు ములుగు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.




