Mulugu: ములుగులో ఘనంగా పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడా పోటీలు!

Mulugu: ములుగు జిల్లా జాకరం గురుకులంలో జరిగిన పీఎం శ్రీ క్రీడా పోటీలను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రారంభించారు. జాకరం పాఠశాల ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.

Narender, Staff Reporter  -Warangal
Published on: 27 Oct 2026 10:27 PM IST
Mulugu
X

Mulugu: ములుగులో ఘనంగా పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడా పోటీలు!

ములుగు: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని విజయంవైపు సాగాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు విద్యార్థులకు సూచించారు. మంగళవారం ములుగు జిల్లా జాకరం గురుకుల పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పీఎం శ్రీ క్రీడా పోటీలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థినీ విద్యార్థులను పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి ఆటలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓడిపోయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదని, లోపాలను సరిదిద్దుకొని మరింత పట్టుదలతో సాధన చేయాలని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.

క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు.

జిల్లాలోని 11 పీఎం శ్రీ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అండర్‌–14, అండర్‌–17 బాలబాలికలకు వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీతోపాటు 100, 200, 400 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జాకరం పాఠశాల ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు, ట్రోఫీలు అందజేశారు.

జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని, వారి సమగ్ర వికాసానికి దోహదపడతాయని అన్నారు. జాకరం పాఠశాల ప్రధానాచార్యులు డాక్టర్‌ ఎ. వెంకటేశ్వర్లు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ఐ ములుగు జిల్లా కార్యదర్శి వి. జగదీష్‌, జిల్లా పీఈటీఏ అధ్యక్షులు గుండెబోయిన మల్లయ్య, కార్యదర్శి బటూరి వేణు, జాకరం పీడీ వెంకట్‌రెడ్డి, పీఈటీలు చంద్రకళ, నాగేందర్‌, రాజు, దీప్తి, కవిత, లక్ష్మీనారాయణ, అవినాష్‌, పద్మశ్రీ సుహాసి, కృష్ణ శరత్‌రెడ్డి, పీఎం శ్రీ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.