Mulugu: ములుగు జిల్లాలో ఘనంగా ప్రారంభమైన వయోవృద్ధుల వారోత్సవాలు!
Mulugu: ములుగు జిల్లాలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు.. చట్టాలు మరియు ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించిన అధికారులు.
Mulugu: ములుగు జిల్లాలో ఘనంగా ప్రారంభమైన వయోవృద్ధుల వారోత్సవాలు!
Mulugu: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1వ తేదీని పురస్కరించుకొని, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో 24.09.2026 నుండి 01.10.2026 వరకు వయోవృద్ధుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు.
ఈ వారోత్సవాల్లో భాగంగా గురువారం ములుగు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వయోవృద్ధులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ములుగు ఆర్డీఓ శ్రీమతి శ్రీ. కె. కృష్ణవేణి గారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. ఎన్. గోపాల్ రావుగారు, జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి ఇ.పి. ప్రేమలత గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ములుగు ఆర్డీఓ శ్రీ. కె. కృష్ణవేణి గారు మాట్లాడుతూ, వయోవృద్ధుల సంక్షేమం, రక్షణ మరియు గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వం అమలు చేస్తున్న **తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007)పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
వయోవృద్ధులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చిన వెంటనే చట్టపరమైన నిబంధనల ప్రకారం పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ములుగు జిల్లాలో వయోవృద్ధుల హక్కులు, భద్రత మరియు సంక్షేమ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. ఎన్. గోపాల్ రావుగారు మాట్లాడుతూ, వయోవృద్ధులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వయస్సు పెరిగే కొద్దీ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రక్తపోటు, మధుమేహం, కంటి సమస్యలు, ఎముకలు మరియు కీళ్ల సమస్యలు తదితర సాధారణ ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు పొందాలని సూచించారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, వయోవృద్ధులపై జరుగుతున్న నిర్లక్ష్యం, అవమానాలు, వేధింపులు మరియు ఇతర ఇబ్బందులను నివారించేందుకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వయోవృద్ధుల సమస్యలను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని వారు కోరారు.
జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి ఇ.పి. ప్రేమలత గారు మాట్లాడుతూ, అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో వయోవృద్ధుల వారోత్సవాలను 24 సెప్టెంబర్ నుండి 1 అక్టోబర్ 2026 వరకు వివిధ కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారోత్సవాల కార్యక్రమ షెడ్యూల్‌ను రూపొందించి, వయోవృద్ధుల హక్కులు, ఆరోగ్యం, భద్రత, సామాజిక భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చట్టపరమైన రక్షణ మరియు వయోవృద్ధుల పట్ల కుటుంబం, సమాజం బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో వయోవృద్ధులు, వారి కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ నాగేంద్ర, సీనియర్ అసిస్టెంట్, శ్రీ గణేష్, FRO, ప్రణామ్ డే కేర్ సెంటర్ నిర్వాహకులు శ్రీ చుంచు రమేష్, జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, వయోవృద్ధులు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.




