Mulugu: విద్యార్థులతో వయోవృద్ధుల మమేకం.. ములుగులో ఘనంగా వారోత్సవాలు!

Mulugu: ములుగులో వయోవృద్ధుల వారోత్సవాలు ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో ఆటపాటల పోటీలు పాఠశాలల్లో విద్యార్థులతో పెద్దల ఆత్మీయ కలయిక, అక్టోబర్ 1న బహుమతుల ప్రదానం.

PONNALA SWAMY, MULUGU
Published on: 29 Sept 2026 6:19 PM IST
Mulugu
X

Mulugu: విద్యార్థులతో వయోవృద్ధుల మమేకం.. ములుగులో ఘనంగా వారోత్సవాలు!

ములుగు జిల్లా: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026ను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్ నందు వయోవృద్ధులకు వివిధ క్రీడా మరియు పాటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న వయోవృద్ధులు తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి 01.10.2026న నిర్వహించనున్న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

వయోవృద్ధుల వారోత్సవాలలో భాగంగా ములుగు జిల్లా పరిషత్ హైస్కూల్, జంగాలపల్లి మరియు బండారుపల్లి తెలంగాణ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో వివిధ రంగాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన వయోవృద్ధులు విద్యార్థులతో మమేకమై తమ జీవిత అనుభవాలను, ఆనాటి సామాజిక పరిస్థితులను, విలువలను, కష్టసుఖాలను మరియు తమ తరం నాటి మధుర జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా వయోవృద్ధులు మాట్లాడుతూ, “తాము చూసిన కాలం, అనుభవించిన జీవితం, నేర్చుకున్న విలువలు నేటి తరానికి ఉపయోగపడాలి” అనే ఉద్దేశంతో విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులు కూడా వయోవృద్ధుల అనుభవాలను ఆసక్తిగా విని, వారి జీవిత విశేషాలను తెలుసుకున్నారు.

వయోవృద్ధుల అనుభవాలు ఒక జీవంతమైన పాఠ్యపుస్తకం వంటివని, వారి జీవిత పాఠాలు మరియు విలువలు యువతకు ఎంతో ఉపయోగకరమని అధికారులు పేర్కొన్నారు. తరాల మధ్య అనుబంధాన్ని పెంపొందించడం, వయోవృద్ధుల పట్ల గౌరవభావాన్ని పెంపొందించడం, వారి అనుభవాలను భవిష్యత్ తరాలకు అందించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

ఈ కార్యక్రమాలలో వయోవృద్ధులు శ్రీ సారయ్య గారు, శ్రీ భూమయ్య గారు, శ్రీ శ్యామ్లా నాయక్ గారు, జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి E.P. ప్రేమలత గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీ M. నాగేంద్ర గారు, FRO శ్రీ గణేష్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

“వయస్సు పెరిగినా ఉత్సాహం తగ్గదు – అనుభవం తరతరాలకు వెలుగునిస్తుంది” అనే సందేశంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU