Mulugu: వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలి కలెక్టర్!
Mulugu: ములుగు కలెక్టరేట్‌లో నషా ముక్త్ భారత్ అవగాహన సదస్సు. వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, చదువుపై దృష్టి పెట్టాలని సూచించిన కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.
Mulugu: వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలి కలెక్టర్!
Mulugu: విద్యార్థులు సామాజిక ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కొని, చెడు వ్యసనాలకు ‘నో’ అని స్పష్టంగా చెప్పే గుణాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ, క్రీడలు, పౌష్టికాహారంతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్రవ్యాప్త ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుండి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వర్చువల్ విధానంలో ప్రంగించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, మత్తుపదార్థాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మత్తురహిత సమాజ నిర్మాణాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో కలసి సందేశాన్ని వీక్షించారు. అనంతరం కలెక్టర్ నషా ముక్త్ భారత్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాల దశ నుంచే మంచి అలవాట్లను పెంపొందించుకుని ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల, కళాశాల దశల్లో స్నేహితుల ప్రభావంతో సరదాగా ఒక్కసారి ప్రయత్నిద్దామనే ఆలోచనతో మత్తుపదార్థాలు, ఇతర హానికరమైన వ్యసనాల వైపు వెళ్లవద్దని హితవు పలికారు. ప్రారంభ దశలోనే వాటికి దూరంగా ఉండటం భవిష్యత్తులోనూ వ్యసనరహిత జీవితాన్ని కొనసాగించేందుకు దోహదపడుతుందని తెలిపారు.
‘ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమీ కాదు.. మేమూ చేస్తున్నాం.. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అంటూ స్నేహితులు ఒప్పించే ప్రయత్నం చేసినా ప్రభావితం కావద్దని సూచించారు. తోటి వారిలో కొందరు అలాంటి అలవాట్లకు లోనైనా, వారితో కలవాలనే ఒత్తిడితో వాటిని అనుసరించవద్దని పేర్కొన్నారు. స్నేహం పేరుతో బలవంతం చేసినా తమ నిర్ణయంపై దృఢంగా నిలబడాలని, స్పష్టంగా తిరస్కరిస్తే క్రమంగా ఇతరులు కూడా ఒత్తిడి చేయడం మానుకుంటారని వివరించారు.
చెడు వ్యసనాలకు ‘నో’ చెబుతూ, క్రీడలతో సన్మార్గంలో పయనించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రతిరోజూ క్రీడలు, శారీరక శ్రమకు సమయం కేటాయించాలని సూచించారు. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి తమకు ఇష్టమైన క్రీడల్లో పాల్గొనాలని, నడక, పరుగు వంటి వ్యాయామాలను అలవాటు చేసుకోవాలని తెలిపారు.
క్రమం తప్పని శారీరక శ్రమ వల్ల శరీరం చురుగ్గా ఉండటంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని, చదువుపై ఏకాగ్రతకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మార్కులు, భవిష్యత్తు గురించి అనవసర ఆందోళనకు గురికాకుండా ప్రతిరోజూ చేయాల్సిన పనులు, చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
పౌష్టికాహారం, నిత్య వ్యాయామం, తగిన నిద్రను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ అలవాట్లను పాఠశాల, కళాశాల దశలకే పరిమితం చేయకుండా ఉన్నత విద్య, ఉద్యోగ జీవితంలోనూ నిరంతరం కొనసాగించాలని సూచించారు. శారీరక చురుకుదనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థులు చెప్పిన విషయాలను శ్రద్ధగా విని, ఆలోచించి, ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తారని, అందుకే వారితో సంభాషించడం తనకు ఇష్టమని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో తెలియజేసిన అంశాలపై ఆలోచించి, వాటి ప్రయోజనాలను గుర్తించి, మంచి అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ అల్లం అప్పయ్య, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, సెక్రటరీ రాజి రెడ్డి, కోశాధికారి శిరుప సతీష్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




