Mulugu: 'అమ్మకు అక్షరమాల' - రేపు 3,597 మందికి అక్షరాస్యత పరీక్ష
Mulugu: ములుగు జిల్లాలో రేపు 'అమ్మకు అక్షరమాల' అక్షరాస్యత పరీక్ష. 3,597 మంది నిరక్షరాస్యులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించిన కలెక్టర్ హేమంత్ సహదేవరావు.
Mulugu: 'అమ్మకు అక్షరమాల' - రేపు 3,597 మందికి అక్షరాస్యత పరీక్ష
ములుగు జిల్లా: ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ ద్వారా ములుగు జిల్లాలోని 171 గ్రామ పంచాయతీలు, 20 పట్టణ వార్డుల పరిధిలో గుర్తించిన 3,597 మందికి ఆదివారం మూల అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన మదింపు పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.
15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉల్లాస్ విద్యా కేంద్రాల్లో 100 రోజులపాటు చదవడం, రాయడం, ప్రాథమిక లెక్కలపై శిక్షణ పొందిన అభ్యర్థులు 150 మార్కులకు పరీక్ష రాయనున్నట్లు వివరించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి జాతీయ సార్వత్రిక విద్యాపీఠం నుంచి అక్షరాస్యత ధ్రువపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థుల కోసం స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో, ములుగు పట్టణ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల సౌకర్యాన్ని బట్టి రెండు గంటలపాటు పరీక్ష రాసే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
మండలాల వారీగా ఏటూరునాగారంలో 435 మంది, గోవిందరావుపేటలో 223 మంది, కన్నాయిగూడెంలో 220 మంది, మంగపేటలో 421 మంది, ములుగు మండలంలో 115 మంది, ములుగు పట్టణ పరిధిలో 120 మంది, తాడ్వాయిలో 23 మంది, వెంకటాపూర్‌లో 325 మంది, వెంకటాపురంలో 719 మంది, వాజేడులో 996 మంది చొప్పున మొత్తం 3,597 మంది పరీక్ష రాయనున్నట్లు వివరించారు.
అక్షరజ్ఞానం వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు రోజువారీ జీవితంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కల్పిస్తుందని కలెక్టర్ తెలిపారు. చదవడం, రాయడం, ప్రాథమిక లెక్కలు నేర్చుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలు, బ్యాంకు లావాదేవీలు, ఆరోగ్య సూచనలపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని నిరక్షరాస్యులు సద్వినియోగం చేసుకొని పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అక్షరాస్యులుగా సమాజంలో గౌరవం, గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు వారిని ప్రోత్సహించి పరీక్ష కేంద్రాలకు పంపించాలని కోరారు.
పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు, కూర్చునే సదుపాయం వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గుర్తించిన అభ్యర్థులందరూ పరీక్షకు హాజరయ్యేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా శాఖల సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.




