Hanamkonda: పల్స్ పోలియో ప్రారంభం.. 84 వేల మంది చిన్నారులకు లక్ష్యం!
Hanamkonda: హనుమకొండ ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రారంభించారు.
Hanamkonda: పల్స్ పోలియో ప్రారంభం.. 84 వేల మంది చిన్నారులకు లక్ష్యం!
Hanamkonda: హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ గారు హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో నవంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన ఐదు జిల్లాల్లో హనుమకొండ జిల్లా కూడా ఉండటం సంతోషకరమని తెలిపారు.
జిల్లాలో సుమారు 84 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం 497 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ పోలియో ఒకప్పుడు చిన్నారుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ప్రమాదకరమైన వ్యాధి అని, దేశంలో 2014లోనే పోలియో నిర్మూలన సాధించినప్పటికీ, భవిష్యత్తులో తిరిగి వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఐదేళ్లలోపు చిన్నారులకు గతంలో పోలియో చుక్కలు వేసినా, వేయకపోయినా ఈ కార్యక్రమంలో భాగంగా మరోసారి తప్పనిసరిగా రెండు చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూడా ప్రత్యేక కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, ప్రయాణాల్లో ఉన్న చిన్నారులకు సైతం పోలియో చుక్కలు వేయించుకోవచ్చని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ను మెడికల్ హబ్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తోందని, త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వైద్య చికిత్స సదుపాయాన్ని కల్పించడం ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు నిదర్శనమని అన్నారు.
అదేవిధంగా హనుమకొండ జిల్లాలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలని, సాధారణ ప్రసవం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని వైద్యులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సూచించారు.
ఈ మూడు రోజుల పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఎంపీ కడియం కావ్య కోరారు.
ఈ కార్యక్రమంలో రెడ్ సొసైటీ రాష్ట్ర పాలక వర్గ సభ్యులు EV శ్రీనివాస్ రావు,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య,అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




