Warangal: ప్రజల సాక్షిగా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Warangal: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 61, 63, 8వ డివిజన్లలో రూ.2.33 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Nov 2026 4:49 PM IST
Warangal
X

Warangal: ప్రజల సాక్షిగా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్ ప్రశాంత్ నగర్, 63వ డివిజన్ తిలక్ నగర్‌,8 వ డివిజన్ మార్కస్ స్కూల్ ఆవరణలో సుమారు రూ.2.33 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్ణీత గడువులో పనులను పూర్తి చేసి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రజాపాలనలో భాగంగా అభివృద్ధి అంటే కేవలం జీవోలు తీసుకురావడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం, ప్రెస్‌మీట్లు నిర్వహించడం మాత్రమే కాదని, ప్రజల సాక్షిగా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించి, వాటిని పూర్తి చేసి చూపించడమే నిజమైన అభివృద్ధి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన పనులను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయడంతో పాటు నాణ్యతా నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

వరంగల్ నగరానికి రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు తాగునీరు, మురుగునీటి సమస్యలు తలెత్తకుండా దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలో చేపట్టనున్న నేపథ్యంలో భవిష్యత్తులో మళ్లీ రోడ్లను తవ్వాల్సిన పరిస్థితి రాకుండా సమన్వయంతో పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా నగర భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సుమారు రూ.550 కోట్లతో 4 నుంచి 8 ఇంచుల పైప్‌లైన్ వ్యవస్థను విస్తరించే ప్రణాళిక ఉందని, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ సామర్థ్యాన్ని కూడా పెంచి రాబోయే మూడు, నాలుగు దశాబ్దాల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి వరంగల్ అభివృద్ధికి అవసరమైన పలు కీలక ప్రాజెక్టులను సాధించుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విమానాశ్రయం, తాగునీటి పైప్‌లైన్ విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు ప్రత్యేక చొరవతో ముందుకు వస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నిధులు, అనుమతుల విషయంలో సహకరిస్తున్నారని పేర్కొన్నారు.

గత పదేళ్ల పాలనకు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు.

ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల మధ్యకు వచ్చే నాయకులం తాము కాదని, ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రతిరోజూ రెండు డివిజన్లలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎన్ని నిధులు ఖర్చు చేశామో లెక్కలతో సహా ప్రజల ముందుంచడానికి సిద్ధమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారివెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆజిజ్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్