Warangal: యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలి.. క్రీడల్లో రాణించాలి..మంత్రి!
Warangal: హనుమకొండలో ట్రై సిటీస్ హాఫ్ మారథాన్-2026 రెండో ఎడిషన్ను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. యువత క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Warangal: యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలి.. క్రీడల్లో రాణించాలి..మంత్రి!
Warangal: యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ కార్యక్రమం అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నాయిని విశాల్ ట్రస్ట్, క్రెడాయ్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రై సిటీస్ హాఫ్ మారథాన్–2026 రెండో ఎడిషన్కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై 5K పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, శారీరక వ్యాయామం, క్రీడలు, ధ్యానం ద్వారా ఒత్తిడి, ఆందోళన, ఇతర అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మారథాన్లో సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది పాల్గొనేందుకు నమోదు చేసుకోవడం సంతోషకరమన్నారు.
వరంగల్, హనుమకొండ నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. వరంగల్ విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే గ్రామీణ ప్రాంత యువతకు తగిన అవకాశాలు కల్పించి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. యువతలో పెరుగుతున్న ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ శ్రీగోదా రెడ్డిలను అభినందించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంచడం, ప్రజల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే ఈ మారథాన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కార్యక్రమానికి మరింత స్పందన లభించడం సంతోషకరమన్నారు. మారథాన్ విజయానికి సహకరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, క్రెడాయ్ ప్రతినిధులు, స్పాన్సర్లు, నిర్వాహకులు, క్రీడాకారులు, యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, మారథాన్ నిర్వాహకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రన్నర్లు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




