Mallampally: మండల ఏర్పాటుపై వాస్తవాలు వక్రీకరించొద్దు బీఆర్‌ఎస్
Mallampally: మల్లంపల్లి మండల ఏర్పాటుపై వాస్తవాలు వక్రీకరించవద్దని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్ డిమాండ్. 2023లోనే ప్రాథమిక గెజిట్ జారీ అయిందని వెల్లడి.
Mallampally: మండల ఏర్పాటుపై వాస్తవాలు వక్రీకరించొద్దు బీఆర్‌ఎస్
మల్లంపల్లి: 2023లోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాథమిక గెజిట్ జారీ చేసింది బీఆర్‌ఎస్ మల్లంపల్లి మండల అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్. మల్లంపల్లి మండల ఏర్పాటు చరిత్రను కాంగ్రెస్ నాయకులు వక్రీకరించి మాట్లాడటం సరికాదని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మల్లంపల్లిలో నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండల సాధన కోసం ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేసిన పోరాటాలను గౌరవించాల్సిందేనన్నారు.
అయితే అధికారిక రికార్డుల ప్రకారం మండల ఏర్పాటు ప్రక్రియ 2023లోనే ప్రారంభమైందని తెలిపారు. 2023 సెప్టెంబర్ 23న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మల్లంపల్లి మండల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించే ప్రక్రియ చేపట్టిందన్నారు. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకోవడంతో పాటు మంత్రి సీతక్క అసెంబ్లీలో మల్లంపల్లి మండలం ప్రకటించినందుకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు మండలాన్ని తామే సాధించామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
2024 నవంబర్ 28న తుది గెజిట్ వెలువడి మల్లంపల్లి, రామచంద్రాపురం రెవెన్యూ గ్రామాల పరిధిలోని పది గ్రామాలతో మండలం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం మండల అభివృద్ధికి కార్యాలయాలు, రోడ్లు, ఇతర మౌలిక వసతులకు నిధులు కేటాయిస్తే స్వాగతిస్తామని, అయితే ప్రస్తుత అభివృద్ధి పనులను చూపిస్తూ మండల ఏర్పాటు మొత్తం తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదన్నారు.
మల్లంపల్లి మండలం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ప్రజల చిరకాల ఆకాంక్ష అని పేర్కొన్నారు. కాంగ్రెస్ విధానాలతో విసిగిన యువత పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, భవిష్యత్‌లో మరిన్ని చేరికలు ఉంటాయని అన్నారు. మండల అభివృద్ధిపై రాజకీయాలకు అతీతంగా అధికారిక ఉత్తర్వులు, నిధుల మంజూరు, పూర్తయిన పనుల వివరాలతో మాట్లాడాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనగర్ సర్పంచ్ ఆకుల మల్లేష్, టౌన్ అధ్యక్షుడు చీదర సంతోష్, మాజీ ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, యువజన అధ్యక్షుడు మొర్రిరాజు యాదవ్, వార్డు సభ్యుడు ఎండీ పాషా, నాయకులు మెరుగు రాజు, కుక్కల సంపత్, కట్ల గణపతి తదితరులు పాల్గొన్నారు.




